హైదరాబాద్ : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరటంతో మృతి చెందిన మృతి చెందిన శిశువు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. శుక్రవారం ఆయన విజయవాడ వెళ్లనున్నారు. మరోవైపు విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్ ఇవాళ ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వస్పత్రి దుస్థితిని వివరించేందుకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా, మేరుగ నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాగా విజయవాడ కృష్ణలంక కు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు ఈ నెల 17న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. శిశువుకు మూత్రసంచి, మూత్రనాళాలు బయటకు రావడంతో మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని శిశు శస్త్ర చికిత్సా విభాగానికి తరలించారు. వైద్యులు ఈ నెల 20న శిశువుకు ఆపరేషన్ నిర్వహించి ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ దశలోనే శిశువుపై ఈ నెల 24న ఎలుకలు దాడిచేసి కుడి చేయితోపాటు కాలి వేళ్లను కొరికివేశాయి.
తీవ్ర ఆందోళనకు గురైన తల్లి లక్ష్మి వైద్యులు, ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా బుధవారం తెల్లవారుజామున 4గంటల వేళ రెండోసారి ఎలుకలు పసికందుపై దాడిచేసి ఛాతీ, ఎడమ కణిత, బుగ్గ భాగాలతోపాటు చేతివేళ్లు, కాలివేళ్లు కొరుక్కుతిన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన లక్ష్మి కదలలేని స్థితిలోనూ కేకలు వేస్తూ ఎలుకలను తోలే ప్రయత్నం చేసింది. వైద్యులుగానీ, సిబ్బందిగానీ స్పందించలేదు. పది గంటలపాటు చికిత్స చేసేందుకు వైద్యులెవరూ అక్కడకు రాకపోవడంతో మృత్యువుతో పోరాడిన శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
శిశువు కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
Published Thu, Aug 27 2015 12:10 PM | Last Updated on Tue, Aug 21 2018 3:45 PM
Advertisement