ఎలుకలు కొరికిన హామీలు | Negligence of the doctors on mice biting babe | Sakshi
Sakshi News home page

ఎలుకలు కొరికిన హామీలు

Published Wed, Sep 19 2018 12:42 AM | Last Updated on Wed, Sep 19 2018 11:14 AM

Negligence of the doctors on mice biting babe - Sakshi

తనకు న్యాయం చేయాలంటూ  ‘సాక్షి’ ఎదుట  కన్నీటి పర్యంతమవుతున్న చావలి లక్ష్మి 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాడు పసికందును ఎలుకలు కొరికాయి.  ఆ తల్లికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఎలుకలే కొరికేశాయా?!

జబ్బుతో ఉన్న పసికందును బతికించుకోవాలనే ఆశతో విజయవాడ నుంచి గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగానికి తీసుకొస్తే అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యాడు. బిడ్డను ఎలుకలు కొరుకుతున్నాయంటూ చెప్పినా పట్టించుకోకుండా పచ్చి బాలింతను అప్పుడు అవహేళన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు మంజూరు చేయమని కాళ్లరిగేలా తిరుగుతుంటే ఇప్పుడు హేళనగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రెండుసార్లు కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం శూన్యం. ముగిసిపోయిన అధ్యాయం అంటూ మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం బిడ్డ చనిపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష అయినా పడుతుందంటే అదీ లేకుండా పోయింది. కోర్టులో పిటిషన్‌ వెనక్కు తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.  ‘‘బిడ్డ చనిపోయి మూడేళ్లు దాటుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు.. అందుతుందనే ఆశా పోయిందంటూ.. ఎలుకల దాడిలో మృతిచెందిన పసికందు తల్లి చావలి లక్ష్మి ‘సాక్షి’ ఎదుట బోరున విలపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఆమె పడుతున్న మనోవేదన ఆమె మాటల్లోనే..!

గుంటూరు జీజీహెచ్‌లో శిశు శస్త్రచికిత్స విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న నా బిడ్డను 2015 ఆగస్టు 26వ తేదీన ఎలుకలు కొరుక్కుతిన్నాయి. అప్పటికి మూడు రోజుల ముందు ఎడమ చెయ్యి ఐదు వేళ్లు, కుడిచెయ్యి రెండు వేళ్లను ఎలుకలు కొరికి వేశాయి.  మా బాబును మాకు ఇచ్చేయండి, ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళతామని బతిమలాడాను.. అయినా అక్కడి డాక్టర్లు పట్టించుకోలేదు. డాక్టర్‌ వెళ్లాక అక్కడి నర్సులు సైతం నన్ను హేళనగా మాట్లాడారే తప్ప, బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని కనీస కనికరం చూపలేదు.  తెల్లవారుజామున ఎలుకలు కొరికిన విషయం చెప్పినప్పటికీ మధ్యాహ్నం 2 గంట వరకు డాక్టర్లు రాలేదు. అప్పటికే నా బిడ్డ ప్రాణాలు విడిచాడు. చనిపోయిన బిడ్డకు ట్రీట్‌మెంట్‌ చేయడానికి వస్తారా.. అంటూ నేను వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎవరూ సమాధానం చెప్పలేదు. అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, మరికొందరు ఉన్నతాధికారులు నన్ను పిలిచి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని  రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు అయితే ఇచ్చారు కాని, ఇంత వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం గానీ, ఇల్లు గానీ మంజూరు చేసిన దాఖలాలు లేవు.

ముఖ్యమంత్రితో గోడు వెళ్లబోసుకున్నా..!
నా బిడ్డ చనిపోయిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకున్నా. జులై 23వ తేదీన సచివాలయానికి వెళ్లి  ముఖ్యమంత్రిని కలిసి నా ఆవేదన.. నేను పడుతున్న ఇబ్బందుల గురించి వివరించి న్యాయం చేయాలంటూ వేడుకున్నా. పక్కనే ఉన్న అధికారులను పిలిచి రూ.  50 వేలు నగదు,  ఇల్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశించడంతో న్యాయం జరుగుతుందని ఆశించా. అయితే సీఎం కార్యాలయంలోని అధికారులు నన్ను హేళనగా మాట్లాడారు.  బియ్యం పెట్టగానే అన్నం అవుతుందా.. అన్నం ఉడకగానే కడుపు నిండుతుందా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. అయినా భరించాను. 15 రోజుల తరువాత మరోసారి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి దీనంగా విలపించాను. మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదా అన్నారే తప్ప, అధికారులకు గట్టిగా చెప్పకుండానే వెళ్లిపోయారు. దీంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. రెండు వారాల క్రితం మరోసారి కలుద్దామని వెళితే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కలేదు. నా బిడ్డ చనిపోయి మూడేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు మంజూరు చేయమని ప్రాధేయపడుతూనే ఉన్నా. 

కేసు వెనక్కు తీసుకోమని బెదిరిస్తున్నారు
ఎలుకల కొరికి నా బిడ్డ చనిపోయిన కేసులో నాకు ఇప్పటి వరకు సమన్లు రాలేదు. కేసు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. కేసును పక్కదారి పట్టిస్తున్నారని, కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందంటూ విజయవాడకు చెందిన ఓ న్యాయవాది ద్వారా కోర్టులో íపిటిషన్‌ వేయించాను. ఆ కేసు గురించి తెలుసుకునేందుకు గుంటూరు కోర్టుకు వెళ్లాను. అయితే అక్కడ నన్ను కలిసిన కొందరు కేసు వెనక్కు తీసుకోవాలంటూ బెదిరించారు. కేసు వెనక్కు తీసుకుంటే రూ. 2 లక్షలు ఇస్తామని, లేదంటే ఇబ్బందులు పడతావంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నా బిడ్డ  బలయ్యాడనే విషయం దేశం మొత్తం తెలుసు. ఇలాంటి వారిని క్షమించి ఎలా వదిలేయాలి? అలా వదిలేస్తే నాలాంటి ఎందరో తల్లులకు కడుపు కోత తప్పదు. నాలా ఏ తల్లి బాధపడటానికి వీల్లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని చెప్పారు చావలి లక్ష్మి..

హామీల పేరుతో మోసం చేశారు
ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రభుత్వం, జీజీహెచ్‌ అధికారులపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, ప్రత్యక్ష ఆందోళనలకు దిగడంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్, జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు జీజీహెచ్‌కు వచ్చి మృతిచెందిన పసికందు తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలతో చర్చించి అన్ని విధాలా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రూ. 5 లక్షల నగదుతోపాటు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, సొంత ఇల్లు మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చి, గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. ఏదైనా దుర్ఘటన జరిగిన ప్రతిసారి నష్టపరిహారం పేరుతో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి పరిస్థితి చక్కబడగానే పట్టించుకోకుండా వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. గతంలో జరిగిన అనేక ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పసికందు మృతిచెంది మూడేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీ ప్రకారం బాధితులకు ఇల్లు మంజూరు చేయకుండా తిప్పుకోవడమే కాకుండా అవహేళనగా మాట్లాడుతూ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
– ఎన్‌.మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement