అప్పుల్లో ఉప్పు రైతు
అల్లూరు: ఇంటిల్లిపాది ఆరు నెలల పాటు రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసినా చివరకు నష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి ధరల్లో వ్యాపారులు మాయాజాలం చూపుతుండడంతో పెట్టుబడి కూడా చేతికిరాక అప్పుల పాలవుతున్నారు. తీరప్రాంతంలోని ఉప్పురైతుల దుస్థితి ఇది. రెండేళ్లుగా వీరు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అల్లూరు మండలంలోని గోగులపల్లి, ఇస్కపల్లి తీరప్రాంతాలు ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై నెలాఖరు వరకు ఉప్పుకు మంచి గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో రైతు ఇంట్లోని కుటుంబసభ్యులందరూ కష్టపడి ఉప్పు ఉత్పత్తి చేస్తారు. అందరి కష్టానికి ఫలితం లభిస్తే ఎకరానికి 5 లారీల ఉప్పు ఉత్పత్తి అవుతుంది.
ఉప్పు ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా ధరలు మాత్రం నిరుత్సాహపరుస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం లారీ ఉప్పు రూ.5 వేలు నుంచి రూ. 6వేలు మాత్రమే పలుకుతోంది. ఈ క్రమంలో రోజుకు రూ.200 కూడా కూలిగిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. రెండేళ్ల క్రితం బస్తా ఉప్పు సీజన్‌లో రూ.100 పలికేది. ప్రస్తుతం ఆ ధర రూ.60కి చేరింది. ఉప్పు ధర పలకని సమయంలో పెద్ద రైతులు నిల్వ చేసుకుని మార్కెట్ ఆశాజనకంగా ఉన్న సమయంలో విక్రయించుకుని లాభాలు గడిస్తున్నారు. చిన్నసన్నకారు రైతులు మాత్రం ఉప్పును దాచుకునే శక్తి లేక పొలాల్లోనే దళారులు అడిగిన ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. రైతుల నిస్సహాయతను గమనించిన దళారులు కూడా ధరను గణనీయంగా తగ్గించేస్తూ దోచుకుంటున్నారు.
కరెంట్ కష్టాలతో మరింత నష్టం
ధర గిట్టుబాటు కాక అప్పులపాలవుతున్న ఉప్పు రైతుకు విద్యుత్ కోతలు, బిల్లులు పుండు మీద కారం చల్లినట్లవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టలేక సతమతమవుతున్న ఉప్పు రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఉప్పు ఉత్పత్తికి సంబంధించి వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి వంతున వసూలు చేయాలని నిర్ణయించారు.
ఇది రైతులకు నష్టాల నుంచి విముక్తుల్ని చేసింది. వైఎస్సార్ మరణానంతరం అధికారం చేపట్టిన నేతలు మళ్లీ యూనిట్ ధరకు రూ.4కి పెంచడంతో రైతులకు కష్టాలు పున రావృతమయ్యాయి. కష్టపడి ఉప్పు ఉత్పత్తి చేసినా ఆశించిన ధర లభించకపోవడంతో అసలు పండించాలో లేక బీడు పట్టాల అర్థం కాక రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు ఓ సారి ఉప్పు కయ్యలను సందర్శించి తమ కష్టాలను పరిశీలించి, ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు.