నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దీంతో ఇందూరు సిమ్లాను తలపిస్తోంది. ఉత్తర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న గాలులతోనే చలి పెరిగిందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో మరి కొద్ది రోజులు ప్రజలు గజగజ వణకాల్సిందే. జనవరి, ఫిబ్రవరి మాసాలలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని, మంచు బాగా కురుస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇందూరులోనే
తెలంగాణలోని ఇతర జిల్లాలకంటే ఇందూరులో భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. నవంబర్ నెలాఖరులోనే చలి ఎక్కువైనా, హేమంత రుతు వు ఆరంభంతో తీవ్రత మరింత పెరిగింది. ఈనెల నాలుగో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ సీజన్‌లో సాధారణంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాలని, అయితే జిల్లాలో ఆదివారం 11.9 డిగ్రీలు నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి 1982లో ఒకసారి జిల్లాలో ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోగా 2009లో 12 డిగ్రీలకు పడిపోయింది.
చలితో అనారోగ్యం
ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజ లు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. న్యూమోనియా, అస్తమా, ద గ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పొద్దెక్కేంతవరకు ముసుగుతన్ని పడుకుంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు ఇంట్లోనుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లేవారు స్వెట్టర్లు, మఫ్లర్లు, టోపీలు, గ్లౌస్‌లు ధరిస్తే మంచిది. ఇంట్లోనూ ఉన్ని దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. చలి తీవ్రత పెరిగిన దృష్ట్యా పిల్లలు, వృద్ధులను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.
వణికిస్తున్న చలి పులి
Published Mon, Dec 9 2013 6:44 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement