
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏడాది కాలంలో సాగిన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలపై సమీక్ష.. రాబోయే నాలుగేళ్లలో చేపట్టాల్సిన పనులకు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకూ ‘మన పాలన–మీ సూచన’ పేరుతో మేధోమథన సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జరుగుతుందన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.
► ప్రజా ప్రభుత్వంలో ఏడాది పాటు సాగిన పాలన, పనితీరు ఏ విధంగా ఉంది. రాబోయే రోజులకు సంబంధించి ప్రజలు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారనే దానిపై ఐదు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
► ఏడాదిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు, పనితీరుపై లబ్ధిదారులు, సమాజంలోని ముఖ్య నాయకులు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి తరహాలో కార్యక్రమాలుంటాయి.
► 25న పాలనా వ్యవస్థలో వికేంద్రీకరణ, గ్రామ, వార్డు స్థాయిలో వచ్చిన మార్పులు, గ్రామ సచివాలయాలు, పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకున్న చర్యలపై మేధోమథనం ఉంటుంది.
► 26న వ్యవసాయం, రైతులు, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడులు, విద్యుత్, సాగునీరు, ఆక్వా, పశు సంవర్ధకం వంటి రంగాల్లో జరిగిన మేలు, ప్రజా సూచనలపై చర్చ.
► 27న విద్యా రంగంలో తెచ్చిన పెను మార్పులు, విద్యను అభ్యసించే పద్ధతిలో వచ్చిన మార్పులు, తల్లులకు కల్పించిన సేవలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య వంటి అన్ని అంశాలపై లబ్ధిదారులు, నిపుణులతో మేధోమథనం.
► 28న పరిశ్రమలకు సంబంధించిన మౌలిక వసతులు, నైపుణ్యాల పెంపు, వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ఆయా రంగాలకు ఏవిధమైన వసతులు వచ్చాయనే దానిపై సమీక్ష. లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం.
► 29న ఆరోగ్య వ్యవస్థపై మేధోమథనం. ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులు, ఆరోగ్య వ్యవస్థ, వైద్య విద్యలో సంవత్సర కాలంగా జరిగిన పనులు, కలిగిన లబ్ధి, రాబోయే రోజులకు సూచనలు తీసుకుంటాం. కోవిడ్‌పైనా సమీక్ష ఉంటుంది.
► 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతుంది.
► రాష్ట్ర స్థాయిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మూడు గంటలపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
► ప్రతిరోజూ ఉదయం పథకాల లబ్ధిదారులు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడి.. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు.
► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకూ అవే అంశాలపై జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, లబ్ధిదారులు, నిపుణులతో ఈ కార్యక్రమం జరుగుతుంది.
► ఆ జిల్లాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజల నుంచి సూచనలు తీసుకుంటాం. 13 జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుని.. వాటన్నింటినీ క్రోడీకరించి ఒక కార్యాచరణ రూపొందిస్తాం.
► ప్రతి రంగానికి సంబంధించి ప్రజల సూచనలు తీసుకుని రాబోయే రోజులకు లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకెళ్లడం వీటి ఉద్ధేశం. ప్రతిరోజూ కార్యదర్శులు ఆయా రంగాలపై క్లుప్తంగా నివేదికలు ఇస్తారు. అనంతరం ప్రజలు, లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం.
► ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమంగా దీనిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతరం ప్రజల అభిమతాలను పరిగణనలోకి తీసుకోవాలనే ధృక్పథంతో ముందుకెళుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment