బందరు దశాదిశ మార్చేస్తాం : ఉమ
బందరుకు పూర్వవైభవం తెచ్చేదిశగా టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. త్వరలో బందరు దశాదిశ మారిపోతాయని చెప్పారు. మచిలీ పట్నంలో మంగళవారం జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణం త్వరలో జరుగుతుందని, రూ.20 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఏర్పాటుకాబోతోందని చెప్పారు.
మచిలీపట్నం టౌన్ : బందరుకు పూర్వవైభవం తెచ్చే దిశగా చంద్రబాబునాయుడు నాయకత్వలోని టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మంగళవారం జన్మభూమి- మాఊరు కార్యక్రమం 38వ వార్డులో జరిగింది. సభకు హాజరైన మంత్రి ఉమా మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణం త్వరలోనే జరుగనుందన్నారు. దీంతో పాటు రూ.20 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఏర్పాటు కాబోతుందని చెప్పారు.
దీనికి అనుబంధంగా పలు పరిశ్రమలు వస్తాయని తెలిపారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. త్వరలోనే ఈ ప్రాంత దశా దిశ పూర్తిగా మారిపోనుందన్నారు. బందరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. సముద్రతీరంలోని భూముల్లో సరుగుడు మొక్కలు పెంచి సముద్రగాలుల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించే చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాపీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పట్టణంలోని 37, 38 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభల్లోనూ ఇరువురు మంత్రులు పాల్గొని పింఛన్లు అందజేశారు. ఆయా వార్డుల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహించిన గర్భిణిల సామూహిక సీమంతాల కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని ఆశీస్సులందజేశారు. కౌన్సిలర్‌లు లంకా సూరిబాబు, పల్లపాటి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాధం, టీడీపీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్, బందరు ఆర్డీవో పి. సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సాధికారిత సంస్థ పేరిట మరో రూ.7వేల కోట్లు ...
నిమ్మకూరు(పామర్రు) : రైతు రుణ మాఫీల కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికారితా సంస్థ పేరిట బ్యాంకులో గతంలోనే రూ. 5వేల కోట్లు వేశామని దీనికి తోడుగా మరోక రూ.7వేల కోట్లను వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నిమ్మకూరు గ్రామంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసిన ఘనత దివంగత మహానేత ఎన్టీఆర్ దేనన్నారు. వచ్చే నెల నుంచి పింఛన్లను బ్యాంకుల ద్వారా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన రాజధాని ఏర్పాటుకు అందరూ తమ వంతు సహకారాన్ని అందజేయాలని కోరారు. గ్రామ సర్పంచి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ పొట్లూరి శశి, ఎంపీపీ దగ్గుపాటి ఉష, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరలు పాల్గొన్నారు.