ఢిల్లీ పెద్దలు దిగి రావలసిందే.. | delhi leaders only have to solve andhra pradesh issue | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పెద్దలు దిగి రావలసిందే..

Published Sat, Aug 17 2013 12:07 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

delhi leaders only have to solve andhra pradesh issue

సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ బలపడుతోంది. 17వ రోజైన శుక్రవారం వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాల నిరసన కొనసాగగా వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు ప్రారంభించింది. ఉద్యోగులు నాలుగవ రోజు కూడా విధుల బహిష్కరించి నిరసన ర్యాలీలు చేశారు. ప్రధాన కూడళ్లలో మానవహారాలుగా ఏర్పడి సమైక్యాంధ్ర  కోసం నినదించారు. ఆర్టీసీ ఉద్యోగులు డిపోల వద్ద నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఒక్క బస్సును కూడా డిపోల నుంచి బయటకు రానివ్వలేదు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు శాఖల ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు బహిష్కరించారు.
 కాగా మంత్రి తోట నరసింహం సతీమణి వాణి కాకినాడలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
 
  వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శుక్రవారం తెల్లవారుజామున కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ దీక్ష విరమించమని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ యువనేతలు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతం, సాల్మన్‌రాజు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో యువకులు చేపట్టిన నిరవధిక దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, రామచంద్రపురంలో ఆర్యవైశ్య సంఘం నాయకుడు గ్రంధి వెంకట రాజు చేపట్టిన  దీక్ష నాలుగో రోజుకు చేరింది. వెఎస్సార్ కాంగ్రెస్ నేత కాపగంటి కామేశ్వరరావు చేపట్టిన 48 గంటల దీక్ష రెండో రోజుకు చేరుకుంది. కాగా ఈ నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతుగా రాజమండ్రిలోని 50 డివిజన్‌లలో రిలే దీక్షలు ప్రారంభిస్తామని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి  విజయలక్ష్మి తెలిపారు.
 
 సమైక్య నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
 కాకినాడలో కలెక్టరేట్ సమైక్యవాదుల నినాదాలతో దద్దరిల్లింది. అక్కడ ఉద్యోగ సంఘాల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రామారావుపేటలోని తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు పాలాభిషేకం చేశారు. పంచాయతీ ఉద్యోగులు డీపీఓ కార్యాలయం నుంచి భానుగుడి మీదుగా కలెక్టరేట్‌కు వరకూ కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దగ్ధం చేశారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ గరగల నృత్యాలతో ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ ఆద్వర్యంలో జెడ్పీసెంటర్‌లో రిలే దీక్షలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకూ ర్యాలీ చేసి అక్కడ మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.  జేఎన్‌టీయూకే విద్యార్థులు నగర వీధుల్లో ర్యాలీ చేశారు. సర్పవరం జంక్షన్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముస్లింలు నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్, తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
 
  కాకినాడ పోర్టు నుంచి ట్రాలీలారీల నిర్వాహకులు సమైక్యాంధ్రకు మద్దతుగాా వాహనాలతో ర్యాలీ చేశారు. రమణయ్యపేటలో పంచాయతీల శానిటరీ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు సర్పవరం జంక్షన్ నుంచి రాజమండ్రి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. పెద్దాపురం సామర్లకోట మీదుగా యాత్ర సాగింది. పెద్దాపురం బార్ అసోసియేషన్ సభ్యులు యాత్రకు స్వాగతం పలికి పట్టణంలో చేపట్టిన ప్రదర్శనలో పాల్గొన్నారు. అమలాపురం డివిజన్ బార్ అసోసియేషన్‌ల సభ్యులు అమలాపురం నుంచి రావులపాలెం వరకూ మోటార్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు.
 
 ఎంపీడీఓల డప్పు విన్యాసాలు
 పంచాయతీ రాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. గడియార స్తంభం సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. డివిజన్‌లోని మండలాల ఎంపీడీఓలు డప్పులు వాయిస్తూ వినూత్నంగా సమైక్య నినాదాలు చేశారు. వీరి ర్యాలీని మంత్రి పినిపే విశ్వరూప్  ప్రారంభించారు. టీడీపీ నేతలు గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చిన్నరాజప్పల ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజక వర్గ స్థాయి ర్యాలీ చేశారు. పలు మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేసి, గడియార స్తంభం సెంటర్ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అదే చోట జేఏసీ ఆధ్వర్యంలో  రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 ఉద్యమించిన వివిధ సంఘాలు
 ఏలేశ్వరంలో ఆటోవర్కర్లు, ఓనర్లు ఆటోలతో ర్యాలీ జరిపి, బాలాజీచౌక్‌లో మానవహారంగా ఏర్పడి సోనియా గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రతిపాడులో కూరగాయల వ్యాపారుల సంఘం ఆధ్వర్యలో ర్యాలీ జరిగింది. గోకవరంలో లారీల యజమానులు లారీలతో ర్యాలీ చేశారు. గండేపల్లి మండలం మల్లేపల్లి నుంచి మురారి వరకూ స్థానిక యువకులు సైకిల్ ర్యాలీ చేశారు. సీతానగరంలో తాపీమేస్త్రీల సంఘం, కోరుకొండలో శ్రీరంగపట్నం సరస్వతీ విద్యానికేతన్  విద్యార్థులు సమైక్య పతాకాలు చేతపుచ్చుకుని ర్యాలీ చేశారు. పెదపూడి మండలం గొల్లలమామిడాడలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద సమైక్యవాదులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. అనపర్తిలో ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. బిక్కవోలులో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రామచంద్రపురంలో సమైక్యాంధ్ర జేఏసీ, బాడీ బిల్డర్స్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. రంపచోడవరంలో స్థానిక యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. సాయంత్రం జేఏసీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు.
 
 కలిసి ఉంటేనే కలదు సత్తా..
 కాగా రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో బస్సుయాత్రలు చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ‘ఆంధ్రా మనదే, తెలంగాణ మనదే, రాయల సీమ మనదే. మూడు ప్రాంతాలు కలిస్తేనే రాష్ట్రానికి శక్తి’ అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రిలో ఉదయం  వి.ఎల్.పురం సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్, శ్యామలా సెంటర్ల మీదుగా లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్ విగ్రహాన్ని చేరుకోవడంతో తొలిరోజు ముగిసింది. అమలాపురం పార్లమెంటు నియోజక వర్గ యాత్రను అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, చర్చిలో ప్రార్థనలు జరిపి ప్రారంభించారు. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలుల మీదుగా మామిడికుదురు చేరుకోవడంతో తొలిరోజు యాత్ర ముగిసింది.  
 
 వరలక్ష్మీ మాతా.. సోనియా మనసు మార్చు!
 రాజమండ్రిలో మున్సిపల్, విద్యుత్తు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన పట్ల యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి మారు మనసు కలగాలని ధవళేశ్వరంలో సమైక్య వాదులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవుల్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన నిరాహార దీక్షల శిబిరంలో వికలాంగులు పాల్గొన్నారు. మారుతీ సెంటర్ వర్తక సంఘం, ఒకేషనల్ కళాశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో శవయాత్ర చేపట్టారు. అంబాజీపేట మండలం ముక్కామలలో రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో గంగిరెద్దుల విన్యాసాలతో సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
 
  అంబాజీపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు. అయినవిల్లి మండలం సిరిపల్లి చర్చిలో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. మలికిపురంలో కేబుల్ ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురంలలో జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షా శిబిరాలకు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు మద్దతు తెలిపారు. సామర్లకోటలో జేఏసీ, ఎన్‌జీవోలు సంయుక్తంగా తహశీల్దారు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష శిబిరం చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక ర్తనిరసన ప్రదర్శన చేశారు. తునిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ర్యాలీచేసి గొల్లఅప్పారావు సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement