ఫైల్ ఫోటో
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అధికారులు, ప్రజలకు కరోనా వ్యాధికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రయాణించిన వారి విషయంలో ఉత్కంఠ తొలగిపోయింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ మత ప్రచార సభలో పాల్గొన్న వారికి ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున జిల్లా మొత్తం ఆందోళనకు గురైంది. జిల్లా నుంచి ఎవరూ ఆ సభకు హాజరు కానప్పటికీ వారు వచ్చిన రైళ్లలో జిల్లాకు చెందిన సుమారు 76 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లా అధికారులు ప్రయాణించిన 76 మందిని గుర్తించారు. వీరందరికీ దశల వారీగా పరీక్షలు జరపగా అందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆదివారం సా యంత్రానికి 135 మందికి సంబంధించిన నమూనాలు పంపించగా 102 రిపోర్టులు నెగెటివ్‌గా తేలా యి. 33 రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో దాదాపు 15 నమూనాలు ఆదివారం సాయంత్రం పంపించారు. జిల్లా వాసులు ఏప్రిల్ 30వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్న ధీమా వద్దని ఇదే పంథాను కొనసాగించి జిల్లాలో వ్యాధి ప్రవేశించకుండా చూడాలని వారంటున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తుండటం వల్ల వాటిని కూడా పూర్తిగా కడిగి, ఎండలో ఉంచిన తర్వాతనే వినియోగించాలని సూచిస్తున్నారు.
మార్కెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి బయటే స్నానం చేసి సబ్బును రెండు సార్లు రాసుకోవాలని చెబుతున్నారు. వ్రస్తాలను కూడా స్నానానికి ముందే తడిపివేయాలని, పసుపు, వేప రాసుకోవడం ద్వారా క్రిమికీటకాలను దూరంగా ఉంచవచ్చని ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన 350 మందికి పైగా మత్స్యకారులు, ఇతరులు పడవల ద్వారా జిల్లాకు చేరుకున్నారని, వారిపై దృష్టిసారించి పరీక్షలు జరపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు సమాచారమందింది. వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు.
మంగళవారం సాయంత్రం సరికి 350 మందిని గుర్తించి వారికి క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరిపించాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజులుగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వివరాలు తెలిస్తే, చుట్టుపక్కల వారు జిల్లాలొ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు, 104 కు తెలియజేయాలని జిల్లా అధికారులు ప్రజలను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment