సైకిళ్లకు ‘చంద్ర’గ్రహణం  | Delivery Of Bicycles In Public Schools On 8th Month In Honor Of The Late Chief Minister YS Rajasekhar Reddy | Sakshi
Sakshi News home page

సైకిళ్లకు ‘చంద్ర’గ్రహణం 

Published Sun, Jul 7 2019 9:05 AM | Last Updated on Sun, Jul 7 2019 9:07 AM

Delivery Of Bicycles In Public Schools On 8th Month In Honor Of The Late Chief Minister YS Rajasekhar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘రాజన్న బడిబాట’లో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసే సైకిళ్లపై ఉన్న లోగో మార్పు ప్రధానోపాధ్యాయులను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఆ సైకిళ్లపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన లోగోలే ఉన్నాయి. వాటిని మార్చి ఇదివరకే సైకిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీ ద్వారా ‘రాజన్న బడిబాట’ లోగో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాకు మాత్రం ఇప్పటిదాకా కొత్త లోగో ఒక్కటీ రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాకు మొత్తం 32,287 సైకిళ్లు రాగా.. 8,762 సైకిళ్లు విద్యార్థినులకు పంపిణీ చేశారు. 23,525 సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది.

తీరా ఎన్నికల ముందు... 
గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల తాయిలాల్లో భాగంగా తీరా ఎన్నికల ముందు సైకిళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంది. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైతే ఫిబ్రవరి నెలాఖరులో పంపిణీ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సైకిళ్లను పాఠశాలలకు చేర్చారు. తీరా బాలికలకు పంపిణీ చేసే  సమయానికి కోడ్‌ అడ్డంకిగా మారి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో సైకిళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది. కాగా 2018–19 సంవత్సరానికి మంజూరు చేసిన సైకిళ్లు కావడంతో ప్రస్తుతం 9, 10 తరగతులు చదువుతున్న బాలికలకు పంపిణీ చేయనున్నారు. 

ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో కూడిన లోగోను సైకిళ్లపై ముద్రించారు. వాటిస్థానంలో ‘రాజన్న బడిబాట’ లోగోను ముద్రించి సైకిళ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైకిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాలికలకు సరఫరా చేసేందుకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటిదాకా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. బాలికలకు సైకిళ్లు ఎలా సరఫరా చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. 

చర్యలు తీసుకుంటున్నాం 
సైకిళ్లపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు లోగోను తొలిగించి ‘రాజన్న బడిబాట’ లోగో ముద్రించి సరఫరా చేయాలని కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏజెన్సీ వారితో మాట్లాడాం. వారు జిల్లాలో సబ్‌ ఏజెన్సీకి ఇచ్చారట. వారితో కూడా మాట్లాడాం. ఆదివారం లోపు కొత్త లోగోలు వస్తాయన్నారు. వాటిని నేరుగా స్కూళ్లకు సరఫరా చేసి అమర్చేలా చర్యలు తీసుకుంటాం. 
– దేవరాజు, ఇన్‌చార్జి డీఈఓ  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement