
సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర్‌రావు
కడప రూరల్: కేవలం అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకోవడం ఎంతమాత్రం తగదని, అది అనర్థాలకు దారి తీస్తుందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) కేంద్ర కమిటీ అధ్యక్షుడు సి.భాస్కర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 15 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఇక రాయలసీమ గురించైతే ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ‘ఎయిమ్స్’ను ఏర్పాటు చేస్తామని చెప్పి దానిని మరొక జిల్లాకు తరలించారని మండిపడ్డారు. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించి నేడు పట్టించుకోవడం లేదన్నారు. కరువు‘సీమ’ హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో సోలార్ ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూముల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కడపలో 17వ రాష్ట్ర మహసభలు
ఓపీడీఆర్‌ను 1975లో స్థాపించామని, ఇంతవరకు 17 రాష్ట్రాల్లో మహాసభలు ఏర్పాటు చేశామని భాస్కర్‌రావు తెలిపారు. అనంతపురం జిల్లాలో రెండుసార్లు సభలు నిర్వహించామని, 2018 జనవరి 20, 21వ తేదీల్లో కడపలో 17వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆర్.రామకుమార్, ఉపాధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.