ఈ డీఈఓ మాకొద్దు | DEO Office Staff Protest infront of Office in Chittoor | Sakshi
Sakshi News home page

ఈ డీఈఓ మాకొద్దు

Published Fri, Jul 10 2020 8:38 AM | Last Updated on Fri, Jul 10 2020 8:38 AM

DEO Office Staff Protest infront of Office in Chittoor - Sakshi

డీఈఓ తీరును నిరసిస్తూ కార్యాలయ ఆవరణలో ధర్నా చేస్తున్న ఉద్యోగులు

డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరసింహారెడ్డి పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వ్యవహారశైలిపై విసిగి వేశారిన ఉద్యోగులు ‘ఈ డీఈఓ మాకొద్దంటూ’ గురువారం సాయంత్రం ఆందోళనకు దిగడం సంచలనం రేపింది. ఈయన తీరుతో ఉపాధ్యాయ సంఘాలు, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉద్యోగులు పెదవి విప్పారు. సమస్యలు పట్టించుకోక పోగా ఆయన పనితీరు మానసిక క్షోభకు గురిచేస్తోందని వాపోయారు. ఆరునెలలుగా విసిగివేసారి ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.   

చిత్తూరు కలెక్టరేట్‌ : ఒకరూ కాదు..ఇద్దరు కాదు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్‌ కేడర్‌ నుంచి అటెండర్‌ స్థాయి వరకు ఉద్యోగులంతా ‘ ఈ డీఈఓ మాకొద్దంటూ’ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈఓ వైఖరిని మార్చుకోవాలని కోరారు. తమకు న్యాయం చేసే వరకు ధర్నా విరమించమని ఉద్యోగులు భీష్మించారు. డీఈఓ వారి వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులు ధర్నాను విరమించారు. ఆ కార్యాలయ ఉద్యోగులు తమ సమస్యలను విలేకరులతో ఇలా చెప్పుకున్నారు.. 

సమస్య మొదలైంది ఇలా..
డీఈఓ కార్యాలయంలో ఏపీఓ  కేడర్‌ లో టెక్నికల్‌ సిబ్బందిగా కొన్నేళ్లుగా నలుగురు టీచర్లు డెప్యూటేషన్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారిని రిలీవ్‌ చేసి మాతృశాఖకు పంపాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌‡ చినవీరభద్రుడు ఏప్రిల్‌ 28న ఉత్తర్వులు జారీచేశారు. నెలలు గడుస్తున్న డీఈఓ రిలీవ్‌ చేయడం లేదు. తమను రిలీవ్‌ చేసి పోస్టింగ్‌లు ఇవ్వకపోతే త్వరలో బదిలీలు నిర్వహిస్తే నష్టపోతామని వారు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. వీరిని రిలీవ్‌ చేయకుండానే సమగ్రశిక్ష శాఖ, ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్‌ పద్ధతిలో పనిచేస్తూ వెనక్కు వచ్చిన వారికి అనుకూలమైన చోట్ల పోస్టింగ్స్‌ ఇచ్చారు. ఈ సమస్యను చివరి సారిగా డీఈఓ దృష్టికి తీసుకొచ్చేందుకు కార్యాలయ ఉద్యోగులంతా శుక్రవారం మధ్యాహ్నం చాంబర్‌కు వెళ్లారు. ఆ సమయంలో దురు సుగా వ్యవహరించి,  బయటకుపోండి అని మందలించారు. దీంతో ఉద్యోగులంతా ఏకమై కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అమ్యామ్యాలు ఇచ్చిన వారికి నచ్చిన చోట పోస్టింగ్స్‌ ఇస్తున్నారని, తమను చులకనగా చూస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పోస్టింగ్స్‌లో కొన్ని..
సమగ్రశిక్ష శాఖలో అసిస్టెంట్‌ ఏఎంఓగా పనిచేస్తూ మాతృశాఖకు బదిలీ అయిన టీచర్‌ లోకనాథంకు నెల ముందు పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన పూర్వ పాఠశాల పిచ్చాటూరు మండలం అయితే అనుకూలంగా రేణిగుంట మండలం గాజులమండ్యంకు పోస్టింగ్‌ ఇచ్చారు.  
రాష్ట్ర సమగ్రశిక్షా శాఖలో పనిచేస్తూ పూర్వస్థానానికి వెనక్కు వచ్చిన ఓ మహిళా టీచర్‌కు పుత్తూరుకు పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉండగా, అనుకూలంగా బంగారుపాళ్యం మండలానికి ఇచ్చారు.  
రాష్ట్ర సమగ్రశిక్ష శాఖలో పనిచేస్తూ పూర్వస్థానానికి వెనక్కు వచ్చిన  ఉర్దూ బయాలజీ టీచర్‌ అబ్దుల్‌గనికి చౌడేపల్లి మండలంలో పోస్టింగ్‌ ఇవ్వాలి. స్వగ్రామమైన వి.కోట మండలం నడిపేపల్లి పాఠశాలకు పోస్టింగ్‌ ఇచ్చారు. 

మరిన్ని ఆరోపణలు ఇలా
విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ పాఠశాల పేరు ముందు టెక్నో అనే పదం వాడకూడదు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాలకు సైనిక్‌ స్కూల్‌ పేరుతో అనుమతులు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పిన సూపరింటెండెంట్‌పై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేసి నోట్‌ఫైల్‌ సిద్ధం చేయించినట్లు సమాచారం.
లైంగిక ఆరోపణలతో ఫోక్సో చట్టం కింద అరెస్టు అయిన ఓ ఉపాధ్యాయుడికి నిబంధనలు పాటించకుండా సస్పెన్షన్‌ ఎత్తివేసి అనుకూల ప్రాంతంలో పోస్టింగ్‌ ఇచ్చారు.
ఐదేళ్లుగా విధులు చేయని ఓ ఉపాధ్యాయుడికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు.
సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల పట్ల కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం. గతంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement