జసిత్, కుటుంబ సభ్యులతో డిప్యూటీ సీఎం బోస్
మండపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగించిన మండపేటలో నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. జసిత్‌ను చూసేందుకు శనివారం మండపేట వచ్చిన డిప్యూటీ సీఎం బోస్ మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో పోలీసులు, మీడియా ఒకరికొకరు పోటీపడి పనిచేశారని ప్రశంసించారు. జసిత్ విషయమై స్వయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీసేవారన్నారు. తాను ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సమీక్షించానన్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ మూడు రోజులపాటు మండపేటలోనే ఉండి కేసు దర్యాప్తు చేయడం పట్ల ఆయనను అభినందించారు. కేసును పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారని, వివరాలు వెల్లడించడం సరికాదని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను కూడా పోలీసులను వివరాలు అడగలేదని, వారిని స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోనివ్వాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.
నిందితులను త్వరలో అదుపులోకి తీసుకోనున్నట్టు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ విషయమై అనుమానాలున్నాయని ఒక విలేకరి అడుగ్గా అసాంఘిక, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యకలాపాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. వారు ఎవరైనా, ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని బోస్ అన్నారు. అటువంటి వ్యక్తులు ఒకవేళ తమ పార్టీలో ఉన్నా వారిని వదులుకుంటామే తప్ప క్షమించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు చాలాచోట్ల సరిగా పనిచేయడం లేదని బోస్ దృష్టికి తీసుకురాగా పక్కాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత జసిత్ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళిని పరామర్శించిన బోస్ కొద్దిసేపు జసిత్‌తో ముచ్చటించారు. నన్ను ఎలా కిడ్నాప్ చేశారంటే..అంటూ బాలుడు చెప్పే మాటలు విని మురిసిపోయారు. లిటిల్ హీరో అంటూ జసిత్‌ను ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాజుబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment