సాక్షి, సంగారెడ్డి: ధర్మాస్పత్రి వైద్యాధికారుల నిర్లక్ష్యమే మానసిక రోగుల పాలిట శాపమైంది. కళ్లెదుటే రోగులు తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్నా చూసి కనికరించడం లేదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏకైన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ మురహరి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంఓ) బాధ్యతలతోనే సరిపెట్టుకుంటున్నారు. వైద్య సేవలందించడానికి సహృదయంతో వైద్యులెవరూ ముందుకు రావడం లేదు. ఆస్పత్రి ఆవరణలోనే నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పదుల సంఖ్యలో రోగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆస్పత్రి సైక్రియాట్రిస్టు మురహరి, పునరావాస కేంద్రం నిర్వాహకుడు మనోహర్‌ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయల నేపథ్యంలో వైద్యులెవరూ రోగుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
లేఖతో గుట్టు రట్టు !
ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఈ నెల 2న కలెక్టర్‌కు రాసిన ఓ లేఖ ‘సాక్షి’కి చిక్కింది. ఆస్పత్రి నుంచి పంపుతున్న రోగులను పునరావాస కేంద్రంలో చేర్చుకోకుండా నిర్వాహకుడు మనోహర్ వెనక్కి పంపిస్తున్నారని ఈ లేఖ ద్వారా ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది తో మనోహర్ దుర్భాషలాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యాధికారులు, నిర్వాహకుడి మధ్య నెలకొన్న విభేదాల మధ్య రోగులు నలిగిపోతున్నారని ఈ లేఖ చెప్పకనే చెప్పుతోంది. మానసిక, శారీరక రుగ్మతలతో రోజురోజుకు కుంగిపోతున్న రోగులకు వైద్యం అందించకుండా.. ఆస్పత్రి క్యాంటీన్ నుంచి సరఫరా చేసే నాసిరకం భోజనం పెట్టి.. ఆ తర్వాత నిద్రమాత్రలు మింగించి చేతులు దులుపుకుంటున్నారు.
ఎవరికీ పట్టదా?
పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న రోగులందరూ బక్కచిక్కిపోయారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఆశ్రయం పొందున్న 61 మంది రోగుల్లో సుమారు 20 మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నా వైద్యాన్ని నోచుకోవడం లేదు. మంగళవారం ‘సాక్షి’లో ‘మృత్యు గోస’ శీర్షికతో ప్రచురితమైన కథనం మానసిక రోగుల వరుస మరణాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు రోగులు మృతి చెందడంతో ఈ కేంద్రంలో చోటుచేసుకున్న మరణాల సంఖ్య 80కు చేరిన విషయాన్ని ఈ కథనం బయటపెట్టింది. పలువురు మానవతావాదులు స్పందించి రోగులకు తమవంతు సహాయం అందిస్తామని ‘సాక్షి’ కార్యాలయానికి సంప్రదించారు. అయితే, ఈ జిల్లా యంత్రాంగం గానీ, అటు ఆస్పత్రి వైద్యాధికారులు గానీ స్పందించకుండా మిన్నకుండిపోవడం విడ్డూరంగా మారింది. గడిచిన 8 ఏళ్లలో సంభవించిన మరణాల్లో అధిక శాతం క్షయ వ్యాధితో సంభవించినవే కాగా, జిల్లా వైద్య శాఖలో క్షయ వ్యాధి నిర్మూలన కోసమే ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తున్నా.. ఇంతకాలం స్పందించకపోవడం శోచనీయం.
నిలువెల్లా నిర్లక్ష్యం
Published Tue, Dec 24 2013 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement