గుంటూరు సిటీ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులను ప్రభుత్వం అవమానిస్తోంది. వారి కాలాన్ని వృథా చేస్తూ రైతులంటే లెక్కలేనట్టు వ్యవహరిస్తోంది. భూసేకరణ విషయమై మాట్లాడేందుకు రావాలని ఆహ్వానించి గంటల తరబడి నిలబెట్టింది. ఠంచనుగా వచ్చినా పట్టించుకున్నవారే లేకపోవడంతో రైతులంతా చెట్లకింద నిరీక్షించాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే...
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమని నిరాకరిస్తున్న రైతులతో మాట్లాడాలని భూ సేకరణ సబ్ కమిటీ నిర్ణయించింది. తొలుత గురువారం విజయవాడలో సమావేశమని రైతులకు కబురు చేశారు.
ఆ తరువాత అక్కడ కాదు గుంటూరు రావాలని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు రావాలని కచ్చితంగా చెప్పారు.
భూ సేకరణ సబ్ కమిటీ సూచనల మేరకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి భూములు ఇవ్వబోమంటున్న రైతులు ఠంచనుగా సాయంత్రం ఐదుగంటలకు గుంటూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అప్పటికి భూ సేకరణ సబ్ కమిటీ సభ్యులు రాలేదు.
సమయం ఐదు కాస్తా ఏడయింది..అన్నదాతల్లో అసహనం మొదలైంది. ఏం చేయాలో తోచక అతిథి గృహం ఆవరణలో తచ్చట్లు మొదలెట్టారు. రాత్రి ఎనిమిద య్యింది. ఇప్పటివరకు వేచి ఉండి, ఇక వెనుదిరగడం దేనికని రైతులంతా అక్కడే ఉన్నారు.
రాత్రి ఎనిమిది గంటల తరువాత తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాత్రం తాపీగా అతిథిగృహం చేరుకున్నారు. ఆ తరువాత మంత్రి రావెల కిషోర్‌బాబు వచ్చారు. అయినా సమావేశం ప్రారంభం కాలేదు.
మూడు గంటలకు పైగా వేచి ఉన్న రైతుల్లో ఒక్కసారిగా అసహనం చెలరేగింది. ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలంటూ అతిథి గృహం నుంచి బయటకు బయలుదేరారు. దీంతో ఇటు శ్రావణ్‌కుమార్, అటు రావెల వారిని సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఒక దశలో రైతులు రావెల కిషోర్‌బాబుపై విరుచుకుపడ్డారు. భంగపాటుతో ఆయన లోపలకు వెళ్లిపోగా, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు.
అన్నదాతలకు అవమానం
Published Fri, Dec 5 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement