సాక్షి, హైదరాబాద్ : నిండా పదేళ్లు దాటని ఓ బాలిక ఆమె.. నిజాం నిరంకుశ పాలనపై ఊరంతా చేతిలో కర్రలు పుచ్చుకొని పోరాటం చేస్తుంటే తానెందుకు ఇంట్లో కూర్చోవాలని భావించి.. తానూ చేతిలో జెండా పట్టుకొని చుట్టుపక్కల పిల్లలను పోగేసుకొని పోరాటానికి సిద్ధమైంది. దీంతో 12 ఏళ్ల వయస్సులో ఆ బాలికను నిజాం ప్రభుత్వ పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజులు జైల్లో ఉంచి విడిచిపెట్టారు. అయినాసరే ఆమె అదరలేదు.. బెదరలేదు. జైలు నుంచి నేరుగా వీధిలోకే వచ్చి మళ్లీ పోలీసుల ముందే నిజాంకు వ్యతిరేకంగా నినదించింది. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కడవెండి గ్రామానికి చెందిన నల్ల వజ్రమ్మ ఆనాటి స్మతులను నెమరువేసుకుంటూ ఆ రోజులు చాలా బాగుండేవి బిడ్డా.. అంటూ తనగతాన్ని విప్పి చెప్పింది.
హైదరాబాద్‌లో తెలంగాణ సాయుధ పోరాటం వార్షికోత్సవాలకు ఆమె విచ్చేసి తాను చేసిన పోరాటాన్ని చెప్పింది. 13 ఏళ్ల వయసులో ఆమెకు మరో పోరాట యోధుడు నల్ల నర్సింహులుతో వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. నల్లమల అడవుల్లో రోజూ గంటపాటు గుట్టమీద గార్డు డ్యూటీ చేసే పనిని కామ్రేడ్లు ఆమెకు అప్పగించారు. చేతిలో పిస్టల్, సంచిలో బాంబు పెట్టుకొని గుట్టపైకి పోలీసులు వస్తే సమాచారం ఇచ్చేందుకు గార్డుగా రెండేళ్లపాటు విధులు నిర్వహించింది. ఆ సమయంలో వారానికి ఒక్కసారి మాత్రమే తిండి దొరికేది. మంచినీళ్లు తాగుదామంటే నీటి గుంతలవద్ద పోలీసులు కాపలా ఉండేవారు. చెంచులు, కోయలు తమకు అన్నం పెడుతున్నారని తెలిసి పోలీసులు వారిని అడవి అవతలికి తరిమేసి గుడిసెలు వేయించారు.
కడుపు నకనకలాడుతున్నా లక్ష్యాన్ని విడవకుండా ఉద్యమంలో పాల్గొన్నామంటూ ఆమె చెప్పుకొచ్చింది. గర్భందాల్చిన తరువాత కూడా ఉద్యమాన్ని వదల్లేదు. 9వ నెల కడుపుతో ఉండగానే గార్డు డ్యూటీ నిర్వహిస్తుండగాా పురిటినొప్పులు రావడంతో సహచర కామ్రేడ్లు ఆమెను మోసుకొని సమీపంలో ఉన్న క్రిస్టియన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను ప్రసవించిన గంటకే నిజాం పోలీసులు ఆమెను అరెస్టు చేసి ముషీరాబాద్ జైలుకు తరలించారు. ఆర్నెళ్లు ఆమె పసికందుతో జైలులోనే గడిపింది. విడుదలయ్యాక కూతురిని ఇంట్లోనే వదిలి మళ్లీ ఉద్యమం బాట పట్టింది. ఈసారి రెండేళ్ల పాటు ఆమెను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో ఉంచారు.
అరెస్టులకు తాను ఏనాడూ భయపడలేదన్న వజ్రమ్మ ఇప్పుడు 86 ఏళ్ల వయస్సులోనూ ఉద్యమమంటే చేతిలో జెండా పట్టుకొని ముందుకు నడవాలని అనిపిస్తుందని చెప్పింది. చాలా మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు తీసుకుంటుంటే ఆమె మాత్రం పింఛన్‌కు ససేమిరా ఒప్పుకోలేదు. భర్త చనిపోయాక బతుకు భారమై తిండికి కూడా నోచుకోని పరిస్థితుల్లో మిగతా కామ్రేడ్లు ఆమెను ఒప్పించి పింఛన్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఈ మధ్య కాలంలోనే నెలకు రూ. 10 వేల పింఛన్ వస్తుందని దాంతోనే బతుకు వెల్లదీస్తున్నానని వజ్రమ్మ వెల్లడించింది.
నిండా పదేళ్లు దాటకున్నా..నిజాంపై పోరాడింది
Published Thu, Sep 12 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement