
అభివృద్ధి అంటే విశాఖ వరకేనా?
గతం ఘనం.... వర్తమానం అయోమయం....పరిస్థితులు ఇలాగే ఉంటే ఇక భవిష్యత్ అంధకారమే కానుంది. సమైక్య రాష్ట్రంలో పేదరికం,వెనుకబాటు తనంతో సతమతమైన జిల్లా....రాష్ట్ర విభజనాంతరం భవిష్యత్‌పై కోటి ఆశలుపెట్టుకుంది. 13 జిల్లాల్లో తన స్థానాన్ని వెతుక్కుంటూ నిరీక్షిస్తోంది. అయితే పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్ చిత్రం మరింత దారుణంగా ఉండబోతోందని విశ్లేషకులు, విద్యావంతులు భావిస్తున్నారు. అప్పుడూ, ఇప్పుడూ ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లా అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుండగా, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలు ఉపాధి వెతుక్కుంటూ పొరుగు పంచలకు వెళ్తున్నాయి. ఇప్పటికీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో చలనం రాకపోవడంతో జిల్లాలో మిగిలేది కన్నీటి తీరమే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం అభివృద్ధి అంటే విశాఖ వరకేనా? రాష్ట్రంలో వెనుకబడిన విజయనగరం జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయలేరా? వెనుకబడిన ప్రాంతంగా ముద్ర వేసి వదిలేయడమేనా? విభజనానంతరం కూడా అభివృద్ధికి నోచుకోదా?, మన నేతలు ఏం చేస్తున్నారు ? ఇదీ జిల్లాలో విద్యావంతులు, మేధావుల్లోనే కాదు సామాన్య ప్రజల మధ్య జరుగుతున్న చర్చ.
పల్లె ఆర్థికవ్యవస్థకు పునాది వ్యవసాయ రంగం...అంతటి ప్రాధాన్యం గల వ్యవసాయ రంగం ప్రభుత్వం తీరుతో సంక్షోభంలో పడింది. నిరక్షరాస్యత.. దరిచేరని ప్రభుత్వ పథకాలు... అందని విద్య,వైద్యం... ఉపాధి లేమి... ఫలితంగా ఎన్నేళ్లయినా జిల్లా ప్రజల బతుకుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడో ఎత్తయిన కొండలపై విసిరేసినట్టు ఉంటున్న గిరిజన గ్రామాల్లో బతుకు దుర్భరం. అనారోగ్యం వస్తే ఇప్పటికీ పసరమందో, సంచి వైద్యులనో ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక సామాజిక సమస్యలు, వివిధ వృత్తుల మధ్య అంతరాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. దీనికంతటికీ జిల్లా విద్యా విషయకంగా వెనుకబడి ఉండడం, అభివృద్ధిపై నినదించే చైతన్యం నేతల్లో లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. కారణమేదైనా పారిశ్రామికంగా చూసినా, వ్యవసాయ పరంగా చూసినా జిల్లా వెనుకబాటు ముద్ర వేసుకుంది. అలాగని జిల్లాలో ఉన్న వనరులు తక్కువేమీ కాదు. విలువైన ఖనిజాలు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో కూడా తీసిపోనట్టుగా ఉంది. పర్యాటకంగా పోటీ పడుతోంది. ఏజెన్సీ, మైదాన, తీరప్రాంతం మిళితమై ఉంది. కానీ అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు.
విశాఖ వరకే ....
ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెన్నై నుంచి విశాఖ వరకు పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. తీరప్రాంతాన్ని క్లస్టర్లగా విభజన చేసి పారిశ్రామి కంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మత్స్యకారులకు ఇబ్బందుల్లేకుండా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. విశాఖ వరకు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పక్కనే ఉన్న విజయనగరం జిల్లాను పూర్తిగా విస్మరించింది. గతంలో ప్రకటించిన టూరిజం కారిడార్ విషయంలో కూడా ఇదే తరహాలో మొండిచేయి చూపింది. భీమిలి తీర ప్రాంతం వరకు టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేంద్రం పొరుగు జిల్లాలో ఉన్న తీర ప్రాంతంపై నిర్లక్ష్యం చూపింది. దీంతో పర్యాటక అభివృద్ధికి మన తీర ప్రాంతం దూరమయ్యింది.
జిల్లాలో ఉన్న 28 కిలోమీటర్ల తీర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత, మత్స్య ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పా టు చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. చెన్నె నుంచి ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌ను ఇటువైపు వచ్చి ఉంటే జిల్లా అభివృద్ధి చెందడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగాలు లభించేవి. కానీ, విశాఖ వరకే పరిమితం చేసిన పారిశ్రామిక కారిడార్‌తో దగ్గర్లోనే అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. మన జిల్లా నేతలు కూడా ఈ విషయాన్ని కనీసం ఆలోచించడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం లేదు. సర్కార్ తీసుకున్న నిర్ణయానికి తల ఊపడం తప్ప జిల్లాకు మేలు జరిగేలా కృషి చేయడం లేదు.
గిరిజన వర్సిటీ తరలించే యత్నం
జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యోచించారు. ఇప్పుడు దానిని పక్క జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడే ఏర్పాటయ్యేలా కనీసం ప్రయత్నించడం లేదు. ఇక, కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. జిల్లాలో బొబ్బిలి, కొత్తవలస, విజయనగరం, నెల్లిమర్లలో పారిశ్రామిక వాడలున్నాయి. స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ చొరవ చూపించే వారే కరువయ్యారు. పోనీ, జిల్లా వెనుకబడిందన్న ఉద్దేశంతో ప్రత్యేక ప్యాకేజీ అయినా సాధించారా అంటే అదీ లేదు. బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీలొచ్చినట్టయితే జిల్లా అభివృద్ధి పథంలో పయనించేందుకు అవకాశం ఉంటుంది.