మంత్రి, విప్..ఓ ఎమ్మెల్యే!
అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు జిల్లాకు మంజూరు కావడం సంతోషకరం. ఎక్కువ మందికి అనుకూలంగా ఉండేలా వీటిని ఏర్పాటు చేయడమో.. అమలు చేయడమో చేయాలి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇందులోనూ అంతర్గత రాజకీయాలు చొప్పిస్తున్నారు. ఆధిపత్య పోరుకు వీటినే అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. నర్సింగ్ కళాశాల వివాదమే దీనికి నిదర్శనం. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మంత్రి, విప్, శ్రీకాకుళం ఎమ్మెల్యేల మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. చివరికి ‘ముందు మీరు తేల్చుకోండి.. ఆ తర్వాతే నిర్ణయిస్తామని’ సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతులెత్తేసే స్థాయికి వ్యవహారం ముదిరింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ‘నర్సింగ్ కళాశాల’ చిచ్పు రగిలింది. రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలోని ఈ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. రిమ్స్ ఆస్పత్రికి మంజూరైన ఈ కళాశాలను స్థల సమ స్య కారణంగా ప్రస్తుతానికి రిమ్స్ ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. కళాశాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ఒకవైపు అధికారులు అన్వేషణ సాగిస్తుండగా.. మరోవైపు జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఎవరికి వారు తమకు అనువైన స్థలాలు సూచిస్తూ అక్కడే ఏర్పాటు చేయాలని పట్టుపడుతున్నారు. ప్రధానంగా ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్ మధ్య పోరు సాగుతుండగా.. మంత్రి తన వాదన నెగ్గించుకునేందుకు చాకచక్యంగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని తురుపు ముక్కలా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆమదాలవలసకు తీసుకెళ్లాలని..
జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌కు మంజూరైన నర్సింగ్ కళాశాలను ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రానికి తీసుకెళ్లాలని అక్కడి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తాను ఎన్నికైనప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆమదాలవలసలోని రాజీవ్ విద్యా మిషన్ స్థలంలో కళాశాల ఏర్పాటవుతుందని స్థానికులకు హామీ కూడా ఇచ్చేశారు. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పర్యటనసందర్భంగానూ ప్రస్తావించారు. అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దీనికి అడ్డుపడ్డారు. ఎచ్చెర్ల కొండపైన, అంపోలు ప్రాంతంలో అధికారులు స్థలాలు చూశారని ఆ రెండింట్లో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయాలని.. ఆమదాలవలసలో ఏర్పాటుకు అంగీకరించబోమని ఆరోగ్యమంత్రి సమక్షంలోనే స్పష్టం చేశారు. దీంతో మంత్రి శ్రీనివాస్ చేతులెత్తేశారు. ఎక్కడ పెట్టాలో ముందు మీరంతా తేల్చుకోండి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు.
కుదరని సమన్వయం
విప్ కూన రవి, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సమన్వయం కుదరడం లేదు. బయటకు తామంతా ఒకటే అని చెప్పుకొంటున్నా.. లోలోన కత్తులు దూసుకుంటున్నారు. నర్సింగ్ కళాశాల వివాదమూ అందులో భాగమే. తన నియోజకవర్గ కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేయించాలన్న రవి ఆశలపై అచ్చెన్న నీళ్లు చల్లుతున్నారు. శ్రీకాకుళం తన నియోజకవర్గం కాకపోయినా.. నర్సింగ్ కళాశాల అంశంతో నేరుగా సంబంధం లేకపోయినా.. తాను అనుకున్నదే జరిగి తీరాలని ఆయన భావిస్తున్నారు. విప్‌ను దెబ్బ కొట్టేందుకు తెలివిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని రెచ్చగొడుతున్నట్టు తెలిసింది.
రిమ్స్ ఆమె నియోజకవర్గ కేంద్రంలో ఉన్నందున ఆమెను వివాదాల ఉచ్చులోకి లాగి తన మాట నెగ్గించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్యశాఖ మంత్రి జరిపిన సమీక్షలో పాల్గొన్న లక్ష్మీదేవి ఈ విషయం ప్రస్తావించనే లేదు. మరోవైపు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆమె వేదికపై కూర్చోవడం, మిగతా ఎమ్మెల్యేలు వేదిక ఎదురుగా కిందనే కూర్చోవడంపై అప్పట్లో చర్చ జరిగింది. మీరేమైనా మాట్లాడతారా అని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రే అడిగినా ఆమె మాట్లాడలేదు. పట్టణాభివృద్ధి విషయంలో ఆమె పాదయాత్రలు చేస్తున్నా మంత్రి సమక్షంలో జరిగిన సమీక్షలో సమస్యలు ప్రస్తావించకుండా మౌనం వహించడంపై టీడీపీ కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎవరి స్థలంలో ఏర్పాటు చేస్తారో?
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఉన్నట్టుండి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల నిర్ణయం జరిగిందనే రీతిలో మాట్లాడటం వెనుక ‘మరేదో’ జరుగుతోందని చెబుతున్నారు. వివాదాల్లో ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రాంతంలోని 360 సర్వే నెంబర్‌లోని స్థలంలో కళాశాల ఏర్పటవుతుందని చెప్పడాన్ని తెలుగు తమ్ముళ్లే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే పేర్కొన్న స్థలం ప్రభుత్వ భూమే అయినప్పటికీ వివాదాల్లో ఉన్నట్లు తెలిసింది. దీనికి ఇప్పటికే రెండుమూడుసార్లు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని..
అటువంటి స్థలాన్ని నర్సింగ్ కళాశాలకు ఎంపిక చేయడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూన రవికి దెబ్బ తీసేందుకే అప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి సింగుపురం స్థలం ప్రతిపాదనను తెరపైకి తెప్పించారని పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడే తెర వెనుక నుంచి ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సమీక్షలకు ఇతర ఎమ్మెల్యేలు రాకపోవడం, అన్ని సమీక్షలతో సంబంధం లేకపోయినా లక్ష్మీదేవి వెళ్తుండడం, నర్సింగ్ కళాశాల ఏర్పాటుపై జరుగుతున్న ఆధిపత్య పోరు ను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు.