అశోక్‌ను పరామర్శించిన మంత్రి దేవినేని | Devineni Umamaheswara Rao meets in Ashok Gajapathi Raju | Sakshi
Sakshi News home page

అశోక్‌ను పరామర్శించిన మంత్రి దేవినేని

Published Wed, Apr 6 2016 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

Devineni Umamaheswara Rao meets in Ashok Gajapathi Raju

విజయనగరం క్రైం: కేంద్ర  పౌరవిమానయానశాఖా మంత్రి పూససాటి అశోక్‌గజపతిరాజును రాష్ట్ర భారీ నీటిపారుదల  శాఖామంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. బుధవారం ఆనందగజపతిరాజు బంగ్లాకు చేరుకున్న ఆయన ఆనందగజపతిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును కలిసి సంతాపాన్ని  తెలిపారు.
 
   కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, గజపతినగరం ఎమ్మెల్యే కేఏనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎస్‌ఎన్‌ఎంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తోటపల్లి  బ్యారేజ్ ప్రాజెక్టు ఎస్‌ఈఈ  డోల తిరుమలప్రసాద్‌తో ప్రాజెక్టు గురించి  మంత్రి దేవినేని చర్చించారు.
 
 ‘తారకరామ’ను సందర్శించిన మంత్రి దేవినేని
 సారిపల్లి(నెల్లిమర్ల రూరల్): మండలంలోని సారిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి  దేవినేని ఉమామహేశ్వరావు బుధవారం సందర్శించారు. ముందుగా సారిపల్లిలో ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రదేశానికి చేరుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను, పనులు ఏ స్థాయిలో ఉన్నాయోనని సంబంధిత అధికారులను అడిగి తె లుసుకున్నారు.
 
  అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ రామతీర్థ సాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, తోటపల్లి ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చేశామో రామతీర్థసాగర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలనే దృధసంకల్పంతో ముందుకు వెళ్తోందన్నారు.  అనంతరం స్థానిక ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు మాట్లాడుతూ రిజర్వాయర్ వల్ల నష్టపోయిన  వారికి ఆధారం లేదని, చుట్టూ సముద్రం మధ్యలో నీళ్లు అన్నట్లు ఉన్నారని, కాబట్టి వారందరికీ సముచిత  న్యాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
 
 మంత్రి ఎదుట నిర్వాసితుల ఆవేదన
   పంటపొలాలన్నీ ముంపునకు గురవుతున్నాయని ఎలా బతకాలని,ఎక్కడ నివసించాలని, పలువురు రైతులు మంత్రి దేవినేని ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు, సుమారు 11వందల ఎకరాల పల్లం భూమి ఏడాదికి రెండుపంటలు పండే భూమిని ప్రాజెక్టు పేరుతో 2007లో మా వద్ద నుంచి అతి తక్కువ ధర చెల్లించి భూమిని తీసుకున్నారని  ఆందోళన వెలిబుచ్చారు. మంత్రి స్పందించి పునరావాస ప్యాకేజీని సక్రమంగా అందించాలని కోరారు.
 
 సారిపల్లి గ్రామ సర్పంచ్ రాయి విభీషణరావు ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి, జీవనభృతి గురించి మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు   కేఏ నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు,విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ,ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, ఎస్‌ఈ డోల తిరుములరావు, ఉత్తరాంధ్ర సీఈ శివరామ ప్రసాద్ , ఈఈ ఢిల్లీశ్వరావు,ఎమ్.వి రమణ తదితరులు పాల్గొన్నారు.
 
 పరిహారం పెంచాలి
 పూసపాటిరేగ: రామతీర్థసాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన రైతుల భూములకు పరిహారం పెంచాలని కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డితో పాటు పలువురు రైతులు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావును కోరారు. బుధవారం ఆయన మండలంలోని కుమిలిలో గల రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు.ఈసందర్భంగా రైతులు పలుసమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement