బలప్రదర్శనా క్షేత్రం!
= విస్తృతస్థాయి సమావేశం పేరుతో అధిపత్య ప్రదర్శనకు యత్నం
= విరాళాలు, చందాల పట్టుకోసం కుమ్ములాటల్లో భాగమే!
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో పట్టుపెంచుకుని రాబోయే రోజుల్లో పార్టీకి వచ్చే విరాళాలు, చందాల వసూళ్లపై ఆధిపత్యం చెలాయించేందుకు కొంతమంది నేతలు తహతహలాడుతున్నారు. ఆదివారం జరగబోయే విజయశంఖారావాన్ని ఇందుకు వేదికగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని సాగనీయకూడదనే ఆలోచనలో మరో వర్గం ఉన్నట్లు తెలిసింది. కొంతకాలం క్రితం వరకు జిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీలు ఒకే గొడుగు కింద ఉండేవి. కార్యాలయ నిర్వహణ బాధ్యతంతా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు చూసుకునేవారు.
జిల్లాలో పార్టీకి నెలవారీ వసూళ్లు, విరాళాలు ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన హోటల్ యజమానులు, పారిశ్రామివేత్తలు, ఆటోమొబైల్ ముఖ్యుల నుంచి పార్టీ నేతలు ప్రతి నెలా లక్షల్లో చందాలు వసూలు చేస్తుంటారు. ఎన్నికల సమయంలో, చంద్రబాబు వచ్చినప్పుడు, ఇతర పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ వసూళ్లు మరికాస్త పెరిగి కోట్లకు చేరతాయి. ఈ సొమ్మంతా జిల్లా అధ్యక్షుడు ఉమా ఆధ్వర్యంలోనే ఖర్చు చేసేవారు. పార్టీ కార్యాలయ నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు నెలకు రూ.25 లక్షల వరకు ఖర్చయ్యేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమా కాకుండా ఇతర సామాజికవర్గాల నేత జిల్లా అధ్యక్షుడైతే ఈ వసూళ్లు ఆగిపోతాయని, అప్పుడు పార్టీ నిర్వహణ భారం అవుతుందని పార్టీ సీనియర్ నేతలు భావించేవారు.
సొంత కుంపటి పెట్టుకున్న కేశినేని...
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కేశినేని శ్రీనివాస్ (నాని)ని నియమించిన తరువాత ఆయన సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా అర్బన్ పార్టీని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి విడదీసి తన కార్యాలయానికి తెచ్చుకున్నారు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ప్రస్తుతం ఇక్కడ నుంచే కార్యక్రమాలు చేస్తున్నారు. అర్బన్ అనుబంధ సంఘాలు కూడా ఇక్కడ నుంచే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో పార్టీ వసూలు చేసే సొమ్ము తమకే దక్కాలనే అభిప్రాయం ఈ నేతల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో వసూలు చేసే సొమ్మును జిల్లా పార్టీ కార్యాలయంలో వినియోగించినప్పటికీ, నగర పరిధిలో వసూళ్లు తమకు వదిలివేయాలని వీరు గత కొద్దికాలంగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. దేవినేని ఉమా కూడా జిల్లాకే పరిమితం కావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
విజయశంఖారావం వేదికగా...
ఆదివారం విజయవాడలో విజయశంఖారావం పేరుతో అర్బన్ స్థాయిలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే పార్టీ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తారని చెబుతున్నారు. ఈ సభకు జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇదంతా పైకి చెబుతున్న విషయమే అయినప్పటికీ అంతర్గతంగా రాబోయే 100 రోజులకు పార్టీ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయంపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేదిక ద్వారా అర్బన్ నేతలు కూడా తమ బలం నిరూపించుకుని వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వద్ద గుర్తింపు పొందాలని భావిస్తున్నారు. నగరంలో వసూళ్లపై సుజనాచౌదరి వద్దనే తేల్చుకునేందుకు కొంతమంది నగర నేతలు సిద్ధమౌతున్నారు.
విస్తృతస్థాయి సమావేశంపై విసుర్లు...
జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోనూ, నగరంలోనూ అనేక విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయని, అందువల్ల ఇప్పుడు జరిగే విస్తృతస్థాయి సమావేశానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. విస్తృతస్థాయి సమావేశానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంటోంది. రాబోయే రోజుల్లో కూడా ఉమా సూచించిన విధంగా పార్టీ నడుస్తుందని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ వెంటే ఉంటారని చెబుతోంది. ఏమైనా ప్రస్తుతం అర్బన్, జిల్లా పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో చందాలు ఇచ్చే ప్రముఖులు ఉన్నారు.