
భక్తులతో పోటెత్తిన బిలకూట క్షేత్రం
బిట్రగుంట (నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వేంకటేశ్వరస్వామి బుధవారం రాత్రి పుష్కరిణిలో జలవిహారం చేశారు. కల్యాణోత్సవానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా పెళ్లి కుమారుడైన స్వామివారు కొండపై కొలువుదీరగా అర్చకులు వైఖానస ఆగమోక్తంగా తెప్పోత్సవానికి సిద్ధం చేశారు.
ఆలయ ప్రధానార్చకులు వేదగిరి వేంకట నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వేదపండితులు ఉభయ దేవేరులను, స్వామివారిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలు, పట్టుపీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని ఉభయదేవేరులతో కొలువుదీర్చి జలవిహారం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెప్పోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆచారాన్ని అనుసరించి తెప్పోత్సవానికి అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరుకు చెందిన పీటీ జగన్నాథ్ ఉభయకర్తలుగా వ్యవహరించారు.
పుష్కరిణలో జలవిహారం చేస్తున్న స్వామివారు
చందనాలంకారంలో...
ఆలయ గర్భగుడిలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, దేవేరులు చందనాలంకారంలో కొలువుదీరి భక్తులకు చల్లని ఆశీస్సులు అందజేశారు. చందనాలంకార సేవకు ఉప్పుటూరు నాగరాజు, ఇందిరా, ఉప్పుటూరు సుధాకర్‌రావు, సుజాత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
గజవాహనంపై ప్రసనున్నడు...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం పూర్తి చేసుకున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి పెండ్లి కుమారుడి గజవాహనంపై ఊరేగారు. శుభకర మేళతాళాలు, మంగళవాయిద్యాలు, జయజయధ్వానాల మధ్య స్వామివారు గజవాహనంపై ఊరేగే దృశ్యం నేత్రపర్వంగా సాగింది. గజవాహనసేవకు గుంటూరుకు చెందిన నాగినేని వెంకటేశ్వర్లు, వాణిశ్రీ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
గజవాహనంపై విహారానికి బయలుదేరిన ప్రసన్న వేంకటేశ్వరుడు