సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మలివిడత సమావేశాలకు సంబంధించి గురువారం సీఎం పేరిట బులెటిన్ విడుదలకాగా, దానితో తనకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో వారిద్దరి మధ్య పొసగటం లేదని స్పష్టమైంది. విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైనట్టా... కానట్టా... అన్న వివాదం తలెత్తినప్పుడు వీరిద్దరూ ఒకే మాటగా దానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ నెల 17న బీఏసీ సమావేశంలో చర్చ మొదలైనట్టేనని, దాన్ని వివాదం చేయడం సరికాదని సీఎంతో పాటు స్పీకర్ కూడా అంగీకరించారు. అయితే గురువారం మండలిలో, ఆ తర్వాత విలేకరులతో కిరణ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విభజన బిల్లుపై అసలు చర్చే మొదలుకాలేదని మాట మార్చారు. స్పీకర్‌ను ఇరకాటంలో నెట్టడానికే సీఎం అలా మాట్లాడారని చర్చ జరిగింది. అలాగే బీఏసీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి సభ్యుడు తన అభిప్రాయాన్ని చెప్పాలని భావిస్తున్నందున, రాష్ట్రపతి గడువిచ్చిన జనవరి 23 వరకు సమావేశాలు జరగాలని కోరారు. ఆ మేరకు స్పీకర్ 23 వరకు సమావేశాలను నిర్వహించడానికి నిర్ణయించి వివరాలను సీఎం పేరుతో బులెటిన్ జారీ చేశారు.
ఆ బులెటిన్‌ను గురువారం శాసనసభ వాయిదా పడే సమయానికి ఎమ్మెల్యేలందరికీ పంపిణీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో బులెటిన్ విషయం ప్రస్తావించగా... ఆ విషయం తనకు తెలియదని, దాంతో తనకసలు సంబంధమే లేదని చెప్పారు. జనవరి 23 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో చెప్పిన మాట నుంచి తప్పించుకోవడానికే సీఎం ఈ రకంగా మాటమార్చుతున్నారని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. బీఏసీలో ఖరారైన ఎజెండా శాసనసభ కార్యదర్శి పేరుతోనే బులెటిన్ జారీ అవుతుందని, ముఖ్యమంత్రి పేరుతో విడుదల కావడమేమిటన్న చర్చ జరిగింది. అయితే ఎజెండా ఖరారు చేసేది సభా నాయకుడే అయినందున ఆయన పేరుతో బులెటిన్ జారీ అయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమావేశాలకు ముందు కూడా అసెంబ్లీని ప్రొరోగ్ చేసే అంశంలోనూ స్పీకర్, సీఎంల మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే.
సభాపతులే స్పష్టత ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై సభల్లో ఏ విధంగా చర్చించాలనే అంశంపై శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మండలిలో మాట్లాడారు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశం మన సభల్లో ఇప్పటిదాకా చర్చకు రాలేదు. ఈ బిల్లుపై చర్చించేప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరు ప్రాంతాల వారిని నొప్పించని రీతిలో భాష విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు రావు. ఉద్రేకాలకు లోనవకుండా మాట్లాడాలి. సంప్రదాయాల ప్రకారం చర్చ ఎలా జరగాలో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ప్రధానంగా రెండు అంశాలపై చైర్మన్, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగానికి, చట్టానికి, సంప్రదాయాలకు లోబడి చర్చలు కొనసాగించాలి. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై ఆయా రాష్ట్రాల చట్ట సభల్లో చర్చలకు ఎలాంటి విధానం అనుసరించారో, అక్కడేం జరిగిందో తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2000, బీహార్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు మన ముందున్నాయి. ఈ రెండు పెద్ద రాష్ట్రాల విభజనకు ఆయా రాష్ట్రాల చట్టసభల్లో ఏం చేశారనే అంశాలను తర్జుమా చేసి కాపీలు మీకు పంపుతున్నాను (ఉత్తరాంచల్ ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ సభలో అసెంబ్లీలో అనుసరించిన విధానంలో ఒక అంశాన్ని ఈ సందర్భంగా కోట్ చేశారు). వీటిని అధ్యయనం చేసి, మరోసారి మండలి సలహా కమిటీలో చర్చించి బిల్లుపై చర్చకు సంబంధించి స్పష్టత ఇవ్వండి. అందుకోసమే మీకు (చైర్మన్‌కు) ఈ కాపీలు పంపుతున్నాను’’ అని పేర్కొన్నారు.
చర్చకు స్పష్టత ఇవ్వాలి: యనమల
కిరణ్ ప్రసంగిస్తుండగా, సభను ఎలా జరపాలనే అంశంపై చైర్మన్‌కు సీఎం అప్పీల్ చేయరాదంటూ విపక్ష నేత యనమల రామకృష్ణుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. చర్చ చాలా సున్నితమైనదేనని, కాబట్టి దానిపై ఎలా వ్యవహరించాలో సీఎం స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు.