రీడింగ్ దౌడ్ | differences in reading meter | Sakshi
Sakshi News home page

రీడింగ్ దౌడ్

Published Sat, Dec 28 2013 3:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

differences in reading meter

నెల్లూరు (దర్గామిట్ట),న్యూస్‌లైన్: నెల్లూరులోని ఏసీనగర్‌లో నివాసం ఉంటున్న ఎల్.లక్ష్మమ్మ ఇంటికి ఈ నెల 20వ తేదీన మీటర్ రీడర్ వచ్చి రీడింగ్ నమోదుచేసుకుని బిల్లు ఇచ్చివెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత లక్ష్మమ్మ రీడింగ్‌ను పరిశీలించగా మీటర్‌లో ఉన్న నంబర్లకు బిల్లులో నమోదు చేసిన యూనిట్లకు చాలా తేడా ఉంది.
 
  ఆమె నవంబర్‌లో 80 యూనిట్లు వినియోగించుకోగా సిబ్బంది చేసిన తప్పిదంతో 155 యూనిట్లు వినియోగించుకున్నట్లు నమోదైంది. ఈ క్రమంలో బిల్లింగ్ శ్లాబు మారిపోయి కట్టాల్సిన మొత్తం రూ.531కి చేరడంతో ఆమె లబోదిబోమంటూ విద్యుత్ అధికారుల దగ్గరకు పరుగులు దీశారు. ఈ సమస్య ఒక్క లక్ష్మమ్మకే పరిమితం కాలేదు. జిల్లాలో అనేక మంది వినియోగదారులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.
 
  రోజుకు ఇన్ని మీటర్ల రీడింగ్ తీయాలంటూ కాంట్రాక్టర్లు హుకుం జారీ చేస్తుండటంతో సిబ్బంది హడావుడిలో తప్పుగా నమోదుచేస్తున్నా రు. ఎక్కువ మీటర్ల రీడింగ్ తీస్తే ఎక్కువ కమీషన్ వస్తుందనే వారి ఆత్రుతతో బిల్లింగ్‌లో తప్పులు దొర్లి వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో మొత్తం 11,15,166 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 8,60,479 సర్వీసులు  ఇళ్లకు సంబంధించినవి. వివిధ కేటగిరిల వారీగా నెలకు దాదాపు 18 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది.
 
 తద్వారా విద్యుత్ శాఖకు నెలకు రూ. 80   రాబడి లభిస్తుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి ప్రతి ఇంటికి వెళ్లి రీడింగ్ నమోదు చేసే బాధ్యతను  అప్పగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 విద్యుత్ రెవెన్యూ కార్యాల యాలు (ఈఆర్‌ఓ) ఉన్నారు. ఒక్కో రెవెన్యూ కార్యాలయం పరి ధిలో ఒక్కో కాంట్రాక్టర్‌కు రీడింగ్ నమోదును అప్పజెప్పారు. ఒక్కో మీటర్‌కు నగరాల్లో రూ.2.60, గ్రామాల్లో రూ.4.60 వం తున కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్నారు. ప్రతి నెలా 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదటి విడతగా, 12 నుంచి 19వ తేదీ వరకు రెండో విడతగా రీడింగ్ నమోదు చేసి వినియోగదారులకు బిల్లులు జారీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు నెలలకోసారి మీటర్ రీడింగ్ నమోదు ప్రక్రియ జరుగుతుంది.
 
 హడావుడిగా..
 రీడింగ్ నమోదు కాంట్రాక్టుకు దక్కించుకున్న వారు కొందరు సిబ్బందిని నియమించుకుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్‌శాఖ మీటర్‌కు రూ.2.60 చెల్లిస్తుండగా సిబ్బందికి ఒకటిన్నర రూపాయి ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎక్కువ మీ టర్లకు రీడింగ్ తీస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఆశతో సి బ్బంది హడావుడిగా ముందుకు సాగుతున్నారు. దీంతో తప్పులు దొర్లి వినియోగదారులపై భారం పడుతోంది. జిల్లాలో అనేక చోట్ల ఈ విధంగా తప్పులు దొర్లుతున్నాయి. కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కొంత తగ్గించి పంపుతున్నారే తప్ప, మళ్లీ తప్పులు దొర్లకుండా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిబ్బంది కొరత కారణంగా గడువు కాలం ముగిసినా రీడింగ్ నమోదు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ యూనిట్లు నమోదై శ్లాబులు మారిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.
 
 చర్యలు తీసుకుంటాం
 నాగశయనరావు, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ
 రీడింగ్ నమోదులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకు తప్పుగా రీడింగ్ నమోదు చేశారో సిబ్బందిని విచారిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరుగకుండా అధికారులను అప్రమత్తం చేస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement