మంజునాథ కమిషన్‌ ఎదుట కులసంఘాల ఆందోళన | different communities disquiet in front of manjunath commission | Sakshi
Sakshi News home page

మంజునాథ కమిషన్‌ ఎదుట కులసంఘాల ఆందోళన

Published Tue, Feb 28 2017 4:44 PM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM

different communities disquiet in front of manjunath commission

► అభిప్రాయాలు చెప్పేందుకు రావాలని పిలిచి లోనికి అనుమతించని పోలీసులు
► ఆగ్రహం వ్యక్తం చేసిన పలు సంఘాలు


మొగల్రాజపురం (విజయవాడ తూర్పు) : మంజునాథ కమిషన్‌కు అభిప్రాయాలు చెప్పేందుకు రావాల్సిందిగా సమాచారం ఇచ్చి ఇప్పుడు లోపలకు రానీయకుండా ఆంక్షలు పెట్టడం సరికాదంటూ వివిధ కుల సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంజునాథ కమిషన్‌ సోమవారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియం ఆవరణలో కుల సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆడిటోరియం లోపలకు పరిమిత సంఖ్యలోనే నాయకులను అనుమంతించడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ çసంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషన్‌కు వివరించి న్యాయం చేయమని అడుగుదామంటే లోపలకు వెళ్లనీయకపోవడం సరికాదంటూ నినాదాలు చేశారు.

బీసీ డీ నుంచి ఎ లోకి మార్చాలి: బీసీడీ గ్రూపు నుంచి ఏ గ్రూపులోకి మార్చాలంటూ విజయవాడ నాగవంశం సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు ఎరుబోతు రమణరావు డిమాండ్‌ చేశారు. 44 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వెనుకబడిన తరగతుల కమిషన్‌లను, వెనుకబడిన శాసనసభా కమిటీ వారికి అనేకసార్లు ఈ అంశంపై వివరించామని తెలిపారు. ఇప్పటికైనా తమను బీసీ ఎ గ్రూపులోకి మార్చాల్సిందిగా కోరారు. కమిషన్‌ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అధిక సంఖ్యలో నాగవంశీయులు  కళాశాల దగ్గరకు వచ్చారు. ఆడిటోరియంలోపల కేవలం 300 మంది వరకే పరిమితం అని, అందువల్ల అందరినీ లోపలకు పంపడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం పది మందికి మాత్రమే లోపలకు వెళ్ళాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో నాగవంశీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గో బ్యాక్‌ మంజునాథ కమిషన్‌:  రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చడం అంటే ప్రస్తుతం ఉన్న బీసీ కులాలకు రిజర్వేషన్లను దూరం చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.మహేష్‌ అన్నారు. మంజునాథ కమిషన్‌ ఎదుట తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం ఉన్న  బీసీ జనాభాకు కేవలం 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, ఎన్నో సంవత్సరాల నుంచి 50 శాతంకు పెంచాలని పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతుందని మండిపడ్డారు.

చంద్రబాబు ఉచ్చులో కాపులు పడొద్దు: కాపులను బీసీ జాబితాలో చేరుస్తామంటూ చంద్రబాబునాయుడు కాపులను మోసం చేస్తున్నాడని ఆ ఉచ్చులో కాపు సోదరులు పడవద్దని బీసీ జనసభ అధ్యక్షుడు గంగాధర్‌ అన్నారు. మంజునాథ కమిషన్‌ ఎదుట హాజరై అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బీసీ జాబితాలో చేరుస్తామంటున్నాడని ఈ విషయాన్ని కాపులను గమనించాలని చెప్పారు.

బుడబుక్కల సంఘం సంక్షేమ సోసైటీ వ్యవస్థాపకుడు దాసరి సత్యం మాట్లాడుతూ తమ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర గంగిరెద్దుల కులస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.చిన్న అమ్మోరయ్య మాట్లాడుతూ తమ కులాన్ని బీసీ ఏ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు.

భారీగా పోలీసుల మొహరింపు..ట్రాఫిక్‌ కష్టాలు: మంజునాథ కమిషన్‌ అభిప్రాయ సేకరణ సందర్భంగా మొగల్రాజ్‌పురం పరిసర ప్రాంతాల్లోని రహదారులపై భారీగా పోలీసుల మోహరించారు. బోయపాటి శివరామకృష్ణయ్య కార్పొరేషన్‌ స్కూల్‌ దగ్గర నుంచి ట్రాఫిక్‌ను వి.పి.సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ రోడ్డులోకి మళ్లించారు. ఆ రోడ్డు వెడల్పు తక్కువుగా ఉండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  సిద్ధార్ధ, మధర్‌ధెరిస్సా జంక్షన్‌లను కూడా పోలీసులు ఆధీనంలో ఉండటంతో ఎటువైపు వెళ్లాల్లో ద్విచక్రవాహనచోదకులకు తెలియలేదు. సిద్ధార్ధ జంక్షన్‌కు చేరుకున్న వారిని తిరిగి వెనక్కు వెళ్లాలని పోలీసులు చెప్పడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement