
కష్టాల జడి
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలు కొందరు రైతులకు నష్టం కలిగిస్తుండగా, మరికొందరికి ఉపయుక్తంగా మారుతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలు కొందరు రైతులకు నష్టం కలిగిస్తుండగా, మరికొందరికి ఉపయుక్తంగా మారుతున్నాయి. రబీ సాగుకు సన్నద్దమవుతున్న రైతులకు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భూగర్బ జలాలు కొంతైనా మెరుగు పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ రైతుల భావన ఇలా ఉంటే ముందస్తుగా వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోంది.
అనేక మంది రైతులు వేరుశనగ కట్టెను తొలగించి పంట పొలాల్లోనే ఉంచడంతో ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు పనికిరాకుండా పోతోంది. కళ్యాణదుర్గం, బొమ్మనహాల్, అమరాపురం, ఉరవకొండ, శెట్టూరు తదితర మండలాల్లో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది తొలి నుంచి వర్షాభావంతో వేరుశనగ దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. అంతోఇంతో వచ్చిన దిగుబడిని తీసుకునే సమయంలో వర్షాలు రావడంతో చివరకు పశుగ్రాసం కూడా రైతుల చేతికి దక్కకుండా పోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు వేరుశనగ పంట అపార నష్టాన్నే మిగిల్చింది.
శెట్టూరు మండలంలో కుండపోత వర్షం ధాటికి వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అమరాపురంలో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. బెళుగుప్ప మండలంలో చేతికందే వరి పంట నీట మునగడంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిలింది. కళ్యాణదుర్గంలో పంటలు నష్టపోవడంతో పాటు పలు ఇళ్లు కూలిపోయాయి. గుత్తి జక్కలచెరువులోకి భారీగా వరద నీరు రావడంతో కోతకు గురైంది. శెట్టూరులో 155.8 మిల్లీమీటర్లు, బొమ్మనహాల్‌లో 100.2, బ్రహ్మసముద్రంలో 110.2, డి.హీరేహాల్‌లో 86.8, కంబదూరులో 95.6, గుత్తిలో 56.8, గుమ్మగట్టలో 40.6, అగళిలో 64.2, ఆమడగూరులో 27.7, బెళుగుప్పలో 56.9, కళ్యాణదుర్గంలో 64.6, రాయదుర్గంలో 63.1, విడపనకల్లులో 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రబీ సాగుకు ఉపయుక్తమని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి తెలిపారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకూ పప్పుశనగ సాగుకు సరైన అదును అని, ఈ వర్షాలకు సాగు చేయడం ఉత్తమమని పేర్కొన్నారు.
నష్టం అంచనా వేస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ పంట పొలాలు నీట మునిగాయి. ముఖ్యంగా వేరుశనగ కట్టె పొలాల్లోనే తడిసి పోవడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. ఇప్పటికే అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తాం.
-శ్రీరామమూర్తి, జాయింట్ డైరక్టర్, వ్యవసాయ శాఖ