
కబ్జాలకు సహకరించనందునే కక్షకట్టారు
సీఎంపై దినేశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు
కిరణ్ సోదరుడు ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డారు
సీఎం, ఆయున తమ్ముడి కుంభ కోణాలపై న్యాయపోరాటం చేస్తా
ఎవరికీ భయపడను.. ఇది ఎవరయ్య జాగీరూ కాదు
అనంతపురం ఎస్పీని నిజామాబాద్‌కు బదిలీచేసి డీఎస్‌కు చెక్‌పెట్టాలన్నారు..
తెలంగాణ వస్తే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పమన్నారు
ఏపీఎన్‌జీవోల సభకు సీఎం ఒత్తిడితోనే అనుమతి
ఆయున చెప్పినవి చేయునందునే నన్ను తప్పించారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు సంతోష్‌రెడ్డి ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డాడు... అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి... సీఎం తమ్ముడి భూ కబ్జాలకు సహకరించనందునే డీజీపీగా కొనసాగించకుండా నన్ను తప్పించారు... నన్ను తప్పించేందుకు ముఖ్యమంత్రి కుట్రచేశారు.... అని మాజీ డీజీపీ వి.దినేశ్ రెడ్డి వుంగళవారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దినేశ్ రెడ్డి మాట్లాడారు. భూ కబ్జాలకోసం ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్‌రెడ్డి ఎన్నోమార్లు తనకు ఫోన్‌చేశారని, కానీ తాను అంగీకరించలేదని స్పష్టంచేశారు. వుుఖ్యవుంత్రి పదవిని అడ్డంపెట్టుకుని సీఎం తమ్ముడు కొన్ని వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారన్నారని, ఈ అక్రమాలు చేయించేందుకు ముఖ్యమంత్రి కూడా తన వద్దకు ఎంతో మందిని పంపారని, అక్రవూలకు అంగీకరించనందునే ఆయున తనపై కక్ష కట్టారని దినేశ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్నారు. సీఎం కక్షకట్టి ఏదైనా చేస్తారనే భయం తనకు లేనేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఇది ఎవరయ్య జాగీరూకాదు. నేనెవరికీ భయపడబోను. ఎవరినైనా ఎదుర్కొనే సత్తా నాకూ ఉంది. నేనేం బలహీనుడిని కాదు. అన్ని విధాలా ఎదుర్కొనేందుకు నా వాళ్లూ ఉన్నారు. సమర్థంగా ఎదుర్కొనగలను’’ అని ఆయున ఆవేశంతో చెప్పారు. ముఖ్యమంత్రి, అతని సోదరుడి అక్రమాలపై న్యాయపోరాటానికి సిద్ధమని, ఎవరైనా న్యాయ పోరాటం చేస్తాన న్నా తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందిస్తానని వురో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అనంతపురం ఎస్పీని తప్పించాలన్నారు
తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) నిర్ణయుం అనంతపురం జిల్లాలో జరిగిన ఆందోళన సందర్భంగా జాతీయ నేతల విగ్రహాల ధ్వంసం కేసుల్లో నిందితులను అరెస్టుచేసినందుకు ఆ జిల్లా ఎస్పీని బదిలీకోసం సీఎం, తనపై ఒత్తిడిచేశారని, ఎస్పీని నిజామాబాద్‌కు బదిలీచేసి మాజీ పీసీసీ అధ్యక్షడు డి శ్రీనివాస్‌కు చెక్‌పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆరోపించారు. అరుుతే, శాంతిభద్రతల రక్షణలో సమర్ధంగా వ్యవహరించినందున ఆ ఎస్పీ బదిలీకి తాను అంగీకరించలేదన్నారు. మరికొందరు ఐపీఎస్ అధికారులు, డీఎస్పీల బదిలీలపై కూడా సీఎం ఒత్తిడి తెచ్చారని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన పోస్టింగ్‌ల విషయంలో బదిలీలకు సీఎం పట్టుపట్టారని దినేశ్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమన్నారు
రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెరుగుతుంద ంటూ ముఖ్యమంత్రి, కేంద్రానికి నివేదిక ఇచ్చారని, అది ఊహాజనితం వూత్రమేనని తాను ఢిల్లీలో మీడియాతో చెప్పినందుకే కిరణ్‌కుమార్ రెడ్డి తనపై కినుక వహించారన్నారు. ఢిల్లీకి వెళ్లినపుడు తనతో మాట్లాడకుండానే సీఎం వెళ్లిపోవడాన్ని కొందరు ఎంపీలు గవునించారని, నక్సలైట్ల సమస్యపై తనకు అనుకూలంగా మాట్లాడనందునే ఆయున కోపంగా ఉన్నారని ఎంపీలు తనతో చెప్పారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పాల్సిందిగా సీఎం తనపై ఒత్తిడితెచ్చారని ఆరోపించారు. విభజనపై సీడబ్ల్యుసీ ప్రకటనకు 15 రోజులు ముందుగానే కేంద్రంలోని తన బ్యాచ్ అధికారుల సహకారంతో 40 కంపెనీల బలగాలను సీమాంధ్ర జిల్లాలకు తెప్పించానని, అదనపు బలగాలను సీమాంధ్రకు ముందుగానే తరలించడం ఇష్టంలే క, ముఖ్యమంత్రి తనపై ఆగ్రహం వ్యక్తంచేశారని. ‘‘ఎవరినడిగి అదనపు బలగాలు తెప్పించారు. ఏం చేస్తున్నావో నీకు అర్ధవువుతోందా?’’ అని వుుఖ్యవుంత్రి అన్నారని వివరించారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సభకు అనుమతిపై ముఖ్యమంత్రి ఒత్తిడితెచ్చినా తాను ఒప్పుకోనందునే ఆయున తనపై కోపంపెంచుకున్నారన్నారు. ఎల్‌బీ స్టేడియంలో ఏపీఎన్‌జీవోల సభకు సీఎం ఒత్తిడితోనే అనుమతివ్వాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సీఎం నమ్మించి మోసం చేశారు
డీజీపీగా పదవీ కాలం పొడిగింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను నమ్మించి మోసంచేశారని దినేష్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ తన పదవీ కాలం కొనసాగించాల్సి ఉందని, ఎవరూ కోర్టుకు వెళ్లకుండా నివారించేందుకు, పొడిగింపు జీవోను చివరి నిమిషయంలో ఇస్తానని సీఎం గతంలో తనకు హామీ ఇచ్చారని, చివరకు తాను కోర్టుకు వెళ్లడానికి వీల్లేకుండా సెప్టెంబర్ 27న తన పదవీ విరమణ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు.వుుఖ్యవుంత్రి ఇలా తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్నారు. అత్యంత విఫలమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని, అతన్ని తొలగించాలనే స్థాయి తనదికాదని అన్నారు.
మంత్రికో న్యాయం...నాకో న్యాయమా...!
సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర మంత్రులను తొలగించకుండా, అదే సీబీఐ కేసును సాకుగా చూపుతూ తనను డీజీపీగా కొనసాగించకపోవడం ఏమిటని దినేశ్ రెడ్డి ప్రశ్నించారు. హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలున్న రాష్ట్రమంత్రి ఒకరికి సంబంధించి కీలక సాక్ష్యాధారాలను సీఎంకు అందించినా, సదరు మంత్రిని కొనసాగించారని ఆరోపించారు. మరో హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై ఛార్జిషీటు దాఖలైనా, ఆ అధికారిని తప్పించకుండా కొనసాగించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా దినేశ్ రెడ్డి చెప్పారు. ఒక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది, కేవలం ఊహాగానమేనన్నారు. అమెరికాకు వెళ్లి రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకునే ఆలోచనలో ఉన్నానన్నారు.