సమయ పాలన లేకుంటే క్రమశిక్షణ చర్యలు
గుంటూరు మెడికల్
విధి నిర్వహణలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి హెచ్చరించారు. క్లస్టర్ అధికారులు, వైద్యాధికారులతో గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌సీల సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల మందులను నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాలకు 104 వాహనం వెళ్లినపుడు సమీప ఆరోగ్యకేంద్రంలోని డాక్టర్ తప్పనిసరిగా వె ళ్లి వైద్యసేవలు అందించాలని స్పష్టం చేశారు. గర్భిణుల ఆధార్ నంబర్లను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని, కాన్పులన్నీ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల వివరాలను ఆరోగ్యకేంద్రాల నోటీస్‌బోర్డుపై ఉంచాలన్నారు. గర్భిణులకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇవ్వటంతోపాటు హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రోగులకు సమాచారం అందించేందుకు రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ జిల్లా అధికారి డాక్టర్ మేడ శ్యామలాదేవి మాట్లాడుతూ ఆస్పత్రి కాన్పులకు అందజేసే జేఎస్‌వై పారితోషికాలను అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తారని చెప్పారు. జేఎస్‌వై, జేఎస్‌ఎస్‌కే ఆరోగ్య కార్యక్రమాల నోడల్ అధికారులుగా సీహెచ్‌ఓలు వ్యవహరిస్తారని చెప్పారు. గర్భిణుల ఆధార్ నంబర్ల అనుసంధానాన్ని జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్‌లు ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధార్ అనుసంధానాన్ని సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్‌బాబునాయక్ మాట్లాడుతూ పోలియో వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకపై చుక్కల మందు స్థానంలో వ్యాక్సిన్ రానుందని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి వరదా రవీంద్రబాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, ఏపీ వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జి.శ్రీదేవి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ గాంధీజయంతి నాగలక్ష్మి, జవహర్ బాల ఆరోగ్యరక్ష జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భూక్యా లకా్ష్మనాయక్, డాక్టర్ వై.రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.