సొంత జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష పాటిస్తున్నారు. నిధులు ఏ మాత్రమూ కేటాయించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు.
పైసా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రం ఇచ్చినవీ పక్కదారి {పతి రూపాయీ అమరావతికే
సొంత జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష పాటిస్తున్నారు. నిధులు ఏ మాత్రమూ కేటాయించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. కరువు జిల్లాల జాబితాలో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం అమరావతి దారి పట్టించి జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు.
చిత్తూరు: కరువు జిల్లాగా ఉన్న చిత్తూరుపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు. రెండేళ్ల కాలంలో కనీస నిధులు కేటాయించకపోవడం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఒక్కో జిల్లాకు రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి జిల్లాకు కేటాయించిన నిధులను అమరావతి దారి పట్టించింది. కేటాయించిన మొత్తంలో కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కరువు నివారణ కింద చెరువుల అనుసంధానం, విద్యాభివృద్ధి, మెరుగైన వైద్యం అందించడానికి ఈ నిధులు వెచ్చించాలని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
లెక్కలెవీ..
విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం రాయలసీమకు రూ.1,250 కోట్లు కేంద్రం కేటాయించాల్సి ఉంది. రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం కావడంతో విభజన చట్టంలో ఈ మేరకు కేటాయింపులు ఇస్తామని పేర్కొంది. అయితే ఇచ్చిన రూ.100 కోట్లనే తప్పుదారి పట్టించిన ప్రభుత్వం మొత్తం నిధులు కేటాయిస్తే అంతా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి రాయలసీమ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు సగానికి పైగా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. వైద్యం, తాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుంది.