యువశక్తి నిర్వీర్యం
‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన 100 మంది యువకులను అప్పగిస్తే ఈ దేశగతినే మార్చేస్తా’ స్వామి వివేకానందుడు అన్న మాటలు ఇవి.. ప్రభుత్వాలు చేయూత ఇవ్వకపోవడంతో అటువంటి యువశక్తి నిర్వీర్యమైపోతోంది.
సాక్షి కడప :ప్రతి యేడాది నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీపై రుణాలను అందించి స్వయం ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. మేలో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి. యువతకు పెద్దపీట వేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ఊదరగొట్టిన బాబు.. అధికారంలోకి వచ్చాక అన్నింటినీ విస్మరించారు. నిరుద్యోగభృతి, ఇంటింటికి ఉద్యోగంతో పాటు మరెన్నో చేస్తామన్నా.. ఇంతవరకూ ఏవీ అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని యువత నిరుత్సాహంతో ఉంది.
ఈ యేడాదికి లేనట్టే..
2014-15 యేడాదికి సంబంధించి యువశక్తి యూనిట్లు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. 2014 జూన్ నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినా.. యువత ఉపాధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. 2014 మార్చి నాటి నుంచి 2015 మార్చి వరకు యేడాదిగా పరిగణిస్తారు. ఇప్పటికే దాదాపు పుణ్యకాలం కాస్తా గడిచిపోవడంతో ఈ యేడాది రుణాలు మంజూరు కావడం అనుమానమేనని భావిస్తున్నారు.
పేరుమారినా.. కనిపించని మార్పు..
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతల పేర్లపై ఉన్న పథకాలపై దృష్టి సారించింది. అవే పథకాలను కొనసాగిస్తూ పేర్లను మాత్రం మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. పలు పథకాలకు ఎన్‌టీఆర్ భరోసా, సుజల స్రవంతి, ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీ పేర్లుగా మార్పు చేసింది. అదే విధంగా రాజీవ్ యువశక్తి పథకాన్ని తిరిగి సీఎంఈవై పథకంగా పేరుమార్చారు. పేరు మార్చి దాదాపు మూడు నెలలయినా ఇంత వరకు నిరుద్యోగులకు అవసరమైన రుణాలు, సబ్సీడీల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదు.
2014-15కు 380 యూనిట్లు అవసరం..
2014-15 సంవత్సరానికి సంబంధించి నిరుద్యోగులకు 380 యూనిట్లు అవసరమని.. ఇందుకు రూ. 3.80 కోట్లు కావాలని స్టెప్ కార్యాలయం ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించడానికి బ్యాంకర్ల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. అయితే యువశక్తి రుణాలపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందే తప్ప మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వలేదు.
2013-14కు సంబంధించి రాజీవ్ యువశక్తి పథకం కింద 296 యూనిట్లకు రూ. 2.96 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్‌ఆర్ జిల్లా రాష్ట్రస్థాయిలో పలుమార్లు మొదటిస్థానంలో నిలిచింది. యువకులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి జిల్లాలో స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలు లేక యువశక్తి నీరసించి పోతోంది.
స్టెప్ సీఈఓ మమత ఏమంటున్నారంటే..
ఈ యేడాదికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సబ్సిడీ విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాకు కేటాయింపులు వస్తే నిరుద్యోగులకు యూనిట్లను మంజూరు చేసి ఉపాధికి పెద్దపీట వేస్తాం.