వణికిస్తున్న నిరుద్యోగ భూతం! | Rising Unemployment Problem In the country | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న నిరుద్యోగ భూతం!

Published Thu, Sep 3 2020 6:10 AM | Last Updated on Thu, Sep 3 2020 6:14 AM

Rising Unemployment Problem In the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నిరుద్యోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మరింత పెరుగుతున్న ఈ తరుణంలో ఇది మరింత ఆందోళనకు దారితీస్తోంది. పట్టణాల్లోని సంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి శాచురేషన్‌ పాయింట్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది. జూలైలో 7.43 శాతమున్న నిరుద్యోగ శాతం కాస్తా ఆగస్టు చివరినాటికి మొత్తంగా 8.35 శాతానికి చేరింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భూ తం మరింత ఎక్కువగా భయపెడుతోంది. ఇటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే నిరుద్యోగమున్నా అక్కడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.83 శాతం, గ్రామాల్లో 7.65 శాతం నిరుద్యోగం రికార్డయింది. అదే జూలై నెలలో పట్టణాల్లో 9.15 శాతంగా, గ్రామాల్లో 6.66 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని తెలుస్తోంది. 

ఈనెలా అంతేనా..? 
ఇక ఈ నెల (సెప్టెంబర్‌) లోనూ వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం ఇదే విధంగా కొనసాగడంతో పాటు ఆగస్టుతో పోల్చితే స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అదీగాకుండా కరోనా వైరస్‌ దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు జనవరిలో 7.76 శాతం, ఫిబ్రవరిలో 7.22 శాతమున్న నిరుద్యోగం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండటం, అది క్రమక్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళనకు కారణమవుతోంది. కేంద్రం కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనల తర్వాత ఆగస్టు నెలలో వివిధ వాణిజ్య, వ్యాపార ఇతర ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిచ్చినా కూడా నిరుద్యోగ శాతం తగ్గకపోవడం ఆందోళనకరమేనని పలువురు ఆర్థికవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దేశంలోని నెలవారీ నిరుద్యోగ శాతానికి సంబంధించిన వివరాలను సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. కోవిడ్‌ పరిస్థితుల్లో తలెత్తిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ, వ్యవస్థీకృత రంగాల్లో (ఫార్మల్‌ సెక్టార్‌) ఉద్యోగ, ఉపాధి తగ్గిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతమే రికార్డయింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం నిరుద్యోగమున్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఎక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. 
► హరియాణా–33.5 శాతం 
► త్రిపుర–27.9 శాతం 
► రాజస్తాన్‌–17.5 శాతం 
► గోవా–16.2 శాతం 
► హిమాచల్‌ప్రదేశ్‌–15.8 శాతం 
► పశ్చిమబెంగాల్‌–14.9 శాతం 
► ఉత్తరాఖండ్‌–14.3 శాతం 
► ఢిల్లీ–13.8 శాతం 
► బిహార్‌–13.4 శాతం 
► సిక్కిం–12.5 శాతం 

తక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. 
► కర్ణాటక–0.5 శాతం 
► ఒడిశా–1.4 శాతం 
► గుజరాత్‌–1.9 శాతం 
► తమిళనాడు–2.6 శాతం 
► మధ్యప్రదేశ్‌–4.7 శాతం 
► అస్సాం–5.5 శాతం 
► తెలంగాణ–5.8 శాతం 
► యూపీ–5.8 శాతం 
► మహారాష్ట్ర–6.2 శాతం 
► ఆంధ్రప్రదేశ్‌–7.0 శాతం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement