దుర్గ గుడి సమీపంలో పురోహితులకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న మంత్రి వెలంపల్లి
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణానది దుర్గాఘాట్‌లో పితృకర్మలు నిర్వహించే పేద పురోహితులకు బియ్యం, నిత్యావసర సరుకులను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పురోహితులకు తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూచన మేరకు వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా ప్రభావంతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంటే హైదరాబాద్ వాసి చంద్రబాబు, అజ్ఞాతవాసి పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడం సరికాదన్నారు. మోడల్ గెస్ట్‌హౌస్, కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పితృకర్మలు నిర్వహించే పురోహితులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
విజయమ్మకు ధన్యవాదాలు
పితృకర్మలు నిర్వహించే పేద బ్రాహ్మణుల సమస్యపై వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించడంపై అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పేద బ్రాహ్మణుల సమస్యపై శుక్రవారం విజయమ్మ స్పందించి మంత్రి వెలంపల్లికి సూచించడంతో శనివారం నిత్యావసరాలు పంపిణీ చేశారని, బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment