కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, ఒంగోలు : రాష్ట్రంలో ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణి చేసేందుకు జిల్లా కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలతో గ్రామ సచివాలయాలు, స్పందన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. దీనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఉగాది నాటికి ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి స్థలాల పంపిణీ చేపట్టాలన్నారు. సొంత ఆటోలు, టాక్సీలు ఉన్న అర్హులైన వారికి సెప్టెంబర్ చివరి వారం నాటికి వారి బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.10 వేలు జమచేస్తామన్నారు. అక్టోబర్ 2వ వారం నాటికి రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశామన్నారు. నవంబర్ 21వ తేదీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే వారి ఖాతాలో రూ. 10 వేలు జమ చేస్తామన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఇతర అధికారులు
అదేవిధంగా మత్స్యకారులకు తక్కువ ధరకు డీజిల్ అందించేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డీజిల్‌పై లీటరుకు రూ.6 నుంచి రూ. 9 వరకు సబ్సిడీ పెంచామన్నారు. గ్రామ వలంటీర్లు మత్స్యకారులకు ఈ విషయంపై అవగాహన కల్పించేలా చూడాలన్నారు. డిసెంబర్ 21 నాటికి మగ్గం ఉన్న ప్రతి చేనేకారుడికి రూ.24 వేలు ఇస్తామన్నారు. జనవరి 26 నాటికి అమ్మఒడి పథకం కింద పిల్లలను చదివించే ప్రతి తల్లికి రూ.15 వేలు తల్లి ఖాతాలో జమచేస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి షాపులున్న నాయిబ్రాహ్మణులకు, రజకులకు, టైలర్ల వారి ఖాతాల్లో రూ.10 వేలు జమచేస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి వైఎస్సార్ పెళ్లికానుక ప్రోత్సాహకాన్ని పెంచి ఇస్తామన్నారు. మార్చి చివరి వారంలో దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు, చర్చిల్లో పాస్టర్లకు, మసీదుల్లో ఇమామ్‌లకు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరుకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ చూపాలన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు విడతల వారీగా నగదు
అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.1150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందకు ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశల వారీగా నగదు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం నిర్వహించి వచ్చిన నగదును ప్రభుత్వం జమ చేసుకుంటుందన్నారు. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని చేసినట్లు తెలిపారు. గ్రామ వలంటీర్లు రైతులకు, కౌలు రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని తెలియజేయాలన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు
ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందన్నారు. గత ఐదేళ్ల నుంచి జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో గోల్డ్‌మెడల్ సాధించిన వారికి రూ.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి రూ.4 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.3 లక్షలు జాతీయ స్థాయిలో జూనియర్ క్రీడాకారులకు గోల్డ్‌మెడల్ సాధించిన వారికి రూ.1.25 లక్షలు, సిల్వర్ మెడ్ సాధించిన వారికి రూ.75 వేలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.50 వేలు లెక్కన నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు.
సచివాలయ ఉద్యోగ పరీక్షలు సజావుగా జరగాలి
సెప్టెంబర్‌లో నిర్వహించనున్న గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీకి గ్రామ, వార్డు సచివాలయ భవనాలను సిద్ధం చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ సౌకర్యం, జెరాక్స్, లామినేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఇసుకను బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక కొరత లేకుండా స్టాక్ యార్డ్‌ల్లో ఇసుక నిల్వలు ఉంచాలన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్జీల పరిష్కారంలో తీసుకున్న చొరవను ఇతర జిల్లాల కలెక్టర్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను అభినందించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవని తెలిపారు.
రైతులకు సంబంధించిన పట్టాభూమలను 23 ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో గ్రామ సచివాలయ ఏర్పాట్లకు భవనాలను సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను జిల్లా ఎస్పీతో కలిసి కొన్ని అంశాలను పరిశీలించి వేగవంతంగా పరిష్కరించామని వివరించారు. దీనిలో జాయింట్ కలెక్టర్ షాన్‌మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జేడీలు శ్రీరామమూర్తి, రవీంద్రనాథ్‌ఠా>గూర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సంజీవరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహులు, ఓఎంసీ కమిషనర్ నిరంజన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment