విచ్చలవిడిగా మద్యం పంపిణీ
ఓ సాధువు శిష్యులతో కలిసి ఊరూరూ పర్యటిస్తుంటారు. వీలున్న చోట బస చేస్తుంటారు. ఒకరోజు తన శిష్యులతో కలిసి బస చేసిన ఊళ్లో ఒక వ్యాపారి ఆయనను చూడ్డానికి వచ్చాడు. ‘‘గురువుగారూ, నన్ను క్షమిం చాలి’’ అని పాదాలకు నమస్కరించాడు. ‘‘నువ్వెవరు? నిన్నెందుకు క్షమించాలి? నువ్వు చేసిన తప్పేంటి?’’ అని సాధువు అడిగారు.
‘‘నేను ముప్పై ఏళ్లుగా ఇదే ఊళ్లో వ్యాపారం చేస్తున్నాను. గత ఏడాది నాకు పోటీగా ఒకడు వ్యాపారం మొదలుపెట్టాడు. నా దగ్గరకు వచ్చే వాడుకదారులు అందరూ అతని దగ్గరకు వెళ్తున్నారు. నాకు నష్టం వస్తోంది. దాంతో అతన్ని నేను కోపావేశంతో శాపనార్థాలు పెట్టాను’’
‘‘ఏంటా శాపనార్థాలు?’’
‘‘అతని వ్యాపారం దెబ్బతినాలని శపించాను, దాంతో అతడు ఏడాది తిరగకముందే తీవ్రంగా నష్టపోయాడు. అయితే నాకు అతని నష్టం ఏ మేరకూ తోడ్పడలేదు. ఇంకా ఆర్థిక బాధలతోనే సంసారాన్ని లాగిస్తు న్నాను’’ అన్నాడు వ్యాపారి. సాధువు ఒక నవ్వు నవ్వారు. ‘‘నువ్వు చేసిన ఆ పాత పాపానికి క్షమించమని అడిగేకన్నా దానిని మరచిపోయి ఏదైనా మంచి పని చెయ్యడం మొదలుపెట్టు. నలుగురూ బాగుండేలా ఏదైనా చెయ్యి’’ అని సూచించారు. కానీ అతను అందుకు ఒప్పుకోలేదు.
‘‘లేదు గురువుగారూ, నన్ను మీరు మన్నించాలి. అప్పుడే నా మనసు శాంతిస్తుంది. ఇందుకు ఏదైనా సలహా ఇవ్వండి’’ అని మళ్లీ ఆయన పాదాలపై పడ్డాడు. సాధువు తన శిష్యులవైపు చూశారు. ‘‘మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది’’ అని శిష్యులతో చెప్పారు. శిష్యులు తమ గురువు వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ‘‘కొందరు జరిగిపోయిన కాలంలోనే జీవిస్తుంటారు. అలా ఉండటమే వారికి నచ్చుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోరు.
ఆనందమో, ఆవేదనో దానినే స్మరించుకుంటూ గతంలోనే జీవిస్తుంటారు. అటువంటి వాళ్లు వర్తమానంలో అడుగులు వేసి ఏదీ చెయ్యలేరు. భవిష్యత్తులోనూ తొంగి చూడలేరు’’ అని గురువుగారు ఆ వ్యాపారిని ఉద్దేశించి ఈ నాలుగు మాటలు చెప్పి పొరుగూరికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు.
- యామిజాల జగదీశ్