
నీకో ముద్ద.. నాకో ముద్ద
జిల్లా కలెక్టర్ యువరాజ్ గురువారం జీకేవీధి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. దారకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల చెంతకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. భోజనం చేస్తున్న ఓ చిన్నారి వద్దకు వెళ్లి నాకు కాస్త అన్నం పెడతావా అని అడిగారు. నాలుగో తరగతి చదువుతున్న వంతల లక్ష్మి తొలుత బిడియం పడింది.
పదే పదే అడగడంతో కలెక్టర్ చేతిలో ఓ ముద్దను పెట్టి.. మీరు తినండి సార్ అంది. ఇలా మధ్యాహ్నభోజనాన్ని కలెక్టర్ రుచి చూశారు. చిన్నారులకు పెడుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అంతా బాగా చదువుకొని తల్లితండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
- గూడెంకొత్తవీధి
గూడెంకొత్తవీధి: హుద్‌హుద్ తుఫాన్ కారణంగా పంటలు, ఇళ్లు, కాఫీ, సిల్వర్ ఓక్ చెట్లు నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందిస్తామని జిల్లా కలెక్టర్ యువరాజ్ స్పష్టంచేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా పేరొందిన జీకేవీధి మండలంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులతో పాటు రుణమాఫీ వర్తించే రైతుల సంబంధించి ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సర్వే చేశామని, వీరందరికి బ్యాంకులో నేరుగా పరిహారం సొమ్ము వేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిం దన్నారు.
ఏజెన్సీలో కాఫీ తోటలకు 13 వేల హెక్టార్‌లలో నష్టం వాటిల్లినట్లు నివేదికలు అందాయని, మరో 2 వేల హెక్టార్‌లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారని ఆయన తెలిపారు. ఏజెన్సీలో ఆధార్ నమోదు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. ఏజెన్సీలో రహదారులు అధ్వానంగా ఉన్నందున పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేయాలన్నారు. జిల్లాలో 85 పీహెచ్‌సీలు ఉండగా ఇప్పటి వరకు 50 పీహెచ్‌సీల్లో మాత్రమే పూర్తిస్థాయి వైద్యులు ఉన్నారని, పది మంది ఇన్‌చార్జిలు ఉండగా 25 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యం: మన్యంలో గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు పని చేయాలని కలెక్టర్ అన్నారు. మండలంలో ముందుగా దారకొండ పీహెచ్‌సీకి వెళ్లి అక్కడ రికార్డులను పరిశీలించారు. దారకొండలో అంగన్‌వాడీ భవనాన్ని తనిఖీ చేసి అక్కడ బాలింతలకు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. సప్పర్ల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ట్రెజరీ కుంభకోణంలో దోషులపై క్రిమినల్ కేసులు
చింతపల్లి: ట్రెజరీ కుంభకోణంలో దోషులుగా తేలే వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. గురువారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్ ట్రెజరీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఆడిటర్లను నియమించామన్నారు. జిల్లాలో తుఫాన్ పరిహారం రూ.100 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించామని ఆయన తెలిపారు. తుఫాను బాధితులకు రూ.165 కోట్లతో నిత్యవసర సరకులతోపాటు వివిధ రకాల వస్తువులు అందించామన్నారు.
లంబసింగిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విశాఖ జిల్లాకు టూరిజం అధికారిని నియమించినట్లైతే ఈ ప్రాంతాలు వేగంగా పర్యాటక శాఖలో అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వానికి నివేదించామన్నారు.