సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల్లో నెలకున్న భయాందోళనలు, సందేహాలను షర్మిల ప్రస్తావిస్తూ జనగళాన్ని గట్టిగా వినిపించారు. ‘సమైక్య శంఖారావం’లో భాగంగా ఆదివారం ఒక్కరోజు వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ యాత్రలో ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
రాష్ట్ర విభజనతో సీమాంధ్రులు ఎదుర్కోబోయే కష్టాలు, నష్టాలను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాధాన్యతను వివరిస్తున్నప్పుడు జనం నుంచి మంచి స్పందన లభించింది. విద్య, ఉపాధి రంగాల్లో భవిష్యత్ తరాలు చవిచూడబోయే దుష్పరిణామాలు జనానికి అర్థమయ్యేలా వివరించడంలో ఆమె సఫలీకృతమయ్యారు.
రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు, తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరిని నిశితంగా ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆయనకు సీమాంధ్రలో బస్సు యాత్ర చేసేందుకు హక్కు లేదని విమర్శలు చేసినప్పుడు జనం ఈలలు, కేకలతో తమ అంతరంగం కూడా అదేనని వెల్లడించారు. సీబీఐని కాంగ్రెస్ పెరటి కుక్కగా, చంద్రబాబును గుంటనక్కగానూ పోల్చినప్పుడు సభా ప్రాంగణం పరిసరాలు హర్షధ్వానాలతో మారుమోగాయి. రాష్ట్ర విభజన జరిగితే నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు నీళ్లురాక ఒక చరిత్రాత్మక కట్టడంగా మిగిలిపోతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
బోనులో ఉన్నా సింహం సింహమే..
‘బోనులో ఉన్నా సింహం సింహమే. జగనన్నను అక్రమంగా జైల్లో నిర్బంధించినా సింహమే’ అంటూ షర్మిల ఉద్వేగపూరిత ప్రసంగం జనాన్ని ఉర్రూతలూగించింది. జనంలో ఉన్నా, జైల్లో ఉన్నా జగనన్న జననేతేనని ఆమె స్పష్టం చేశారు. ‘ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపగలరు..? అదే విధంగా జగనన్న కూడా ఏదో ఒక రోజు జైలు నుంచి బయటకు వస్తారు. ఆ రోజు రాజన్య రాజ్యం స్థాపన దిశగా మనలను నడపిస్తారు. అందుకు మీ అండదండలు అవసరం’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.
అపూర్వ స్వాగతం
వైఎస్సార్ జిల్లాలో యాత్ర ముగించుకుని ఆదివారం ఉదయం 10.45 గంటలకు వైఎస్ షర్మిల కాన్వాయ్ మర్రిపాడు మండలం టీపీకుంట వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ ఆమెకు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు పి.అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, డాక్టర్ బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నెలవల సుబ్రమణ్యం, దబ్బల రాజారెడ్డి, నెల్లూరు సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కోవూరు, ఉదయగిరి ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆత్మకూరులో మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడి నుంచి పర్యటన ప్రారంభమైంది. మార్గమధ్యంలో చిరువెళ్ల గ్రామం వద్ద షర్మిల బస్సును స్థానికులు నిలిపారు. దీంతో ఆమె బస్సుదిగి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు.
ఆత్మకూరులో ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డుకిరువైపులా గుమిగూడిన జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బస్టాండ్ ప్రాంగణం నుంచి సోమశిల రోడ్డు వరకు జన సందోహంతో కిటకిటలాడింది. భోజన విరామం తర్వాత కోలగట్ల, సంగం మీదుగా బుచ్చిరెడ్డిపాళెం చేరుకున్నారు. బుచ్చిలో వైఎస్సార్ విగ్రహం నుంచి కోవూరు వైపు, జొన్నవాడ వైపు, చెన్నూరు రోడ్డులో మలిదేవి కాలువ వరకు జనం కిక్కిరిసి పోయారు. షర్మిలను చూసేందుకు కొంత మంది ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. అనంతరం కావలి చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. వేలాది మంది కార్యకర్తలతో కూడలి నలువైపులా జనంతో కిక్కిరిసి పోయాయి.
ప్రసన్న, బాలచెన్నయ్యకు అభినందన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షలకు సంఘీభావంగా కోవూరు, గూడూరులలో దీక్షలు చేపట్టిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సమన్వయకర్త చెంతాటి బాలచెన్నయ్యను వైఎస్ షర్మిల అభినందించారు.
విభజనపై కరవాలం
Published Mon, Sep 9 2013 4:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement