కావూరి కోలాటం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పదవే పరమార్థంగా పావులు కదుపుతున్న కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీల్లో కల్లోలం రేపుతున్నాయి. ఎలాగైనా కావూరిని పార్టీలోకి తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తుండటం కొందరు నేతలకు మింగుడు పడటంలేదు. కావూరిపై వ్యతిరేకతను వ్యక్తం చేసినా అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతుండటంతో టీడీపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
కాంగ్రెస్‌లో లాభం లేదనుకుని..
సమైక్యాంధ్ర వీరుడి ముసుగులో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న కావూరి కాంగ్రెస్‌లో లాభం లేదనుకుని కొద్దికాలం నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. చివరికి తెలుగుదేశంతో లింకు కుదరడంతో అందులోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 13వ తేదీ లోపు కాంగ్రెస్‌కు, మంత్రి పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
మాగంటి, చింతమనేని అసంతృప్తి
తెలుగుదేశం పార్టీలో చేరితే ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కావూరిని గానీ ఆయన కుమార్తెను గానీ బరిలో దింపేం దుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఊరూవాడా గుప్పుమంటోంది. కావూరి అనుచరులూ ఈ విషయాన్ని ఇప్పటికే అందరికీ చెప్పుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మింగుడు పడటంలేదు. కావూరి చేరితే తమ సీట్లకు ఎసరు వస్తుందనే భయంతో వారు గంగవైలెత్తుతున్నారు.
ఇద్దరికీ ప్రత్యామ్నాయాలు
మాగంటి బాబు ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగేం దుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ రెండోసారి దెందులూరు నుంచి పోటీ చేయడానికి ఎప్పటినుంచో రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారు కావూరిని చేర్చుకోవద్దని అధిష్టానానికి గట్టి సంకేతాలు పంపించారు. వాటిని పట్టించుకోని చంద్రబాబు ఇద్దరికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినట్లు తెలిసింది. మాగంటి బాబును దెందులూరు అసెంబ్లీకి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను నూజివీడులో పోటీ చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమ సీట్లకు ఎసరు పెట్టిన కావూరిపై నిప్పులు కక్కుతూనే ఇద్దరూ కూడా ఒకరినొకరు విభేదించుకుంటున్నారు. కావూరి రాక ఖాయమైతే అనివార్య పరిస్థితుల్లో దెందులూరు నుంచి పోటీ చేయడానికి మాగంటి బాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభాకర్ మాత్రం ఇందుకు ససేమిరా ఒప్పుకోవడంలేదు. తాను దెందులూరును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెబుతున్నట్టు తెలిసింది. కావాలంటే మాగంటి బాబునే కైకలూరు అసెంబ్లీకి పంపించాలని ఆయన వర్గం సూచిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రభాకర్‌పై మాగంటి బాబు కారాలు మిరియాలు నూరుతున్నారు.
రాజకీయం రసకందాయం
మాగంటి బాబు తొలుత దెందులూరు నియోజకవర్గం సీటును తన కుమారుడు రాంజీకి ఇప్పించాలని ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఏలూరు పార్లమెంటును చూసుకోమనడంతో దెందులూరును వదిలేశారు. ఇప్పుడు కావూరి వ్యవహారంతో మళ్లీ దెందులూరుకు మాగంటి పేరును ప్రతిపాదించడం, ప్రభాకర్ దాన్ని వ్యతిరేకించడంతో తెలుగుదేశం రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఏలూరు పార్లమెంటు, దెందులూరు అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందనే అంశం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. కావూరి విషయంలో కొందరు అనుకూలంగా ఉండగా, మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. మాగంటి బాబు, ప్రభాకర్ మధ్య గొడవ సర్దుమణగాలంటే కావూరిను చేర్చుకోకపోవడమే మంచిదని పార్టీలోని సీనియర్లు వాదిస్తున్నట్టు సమాచారం. కావూరి వల్ల మేలు జరగకపోగా నష్టం జరుగుతుందనేది వారి వాదన. దీంతో చంద్రబాబు ఏలూరు పార్లమెంటు, దెందులూరు అసెంబ్లీ సీట్లను పెండిం గ్‌లో పెట్టినట్టు సమాచారం.