‘ఆ శకలంపై ఆందోళనే వద్దు'
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గత నెల 31న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ39 రాకెట్ శకలం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని షార్ అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గత నెల 31న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ39 రాకెట్ శకలం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని షార్ అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. నింగిలో ఉన్న రాకెట్ శకలం (ఉపగ్రహాన్ని అమర్చిన ఉష్ణపుగది) నేరుగా స్కైలాబ్ తరహాలో భూమి మీద పడుతుందని భారీఎత్తున ప్రచారం జరుగుతోంది. కొంతమంది పనిగట్టుకుని ఉత్తుత్తి ప్రచారాలు చేస్తున్నారని షార్ అధికారులు పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నుంచి హీట్‌షీల్డ్‌లో అమర్చిన ఉపగ్రహం విడిపోకుండా భూమికి 418 కి.మీ ఎత్తులో ఉందని తెలుస్తోంది. ఈ శకలం నుంచి అప్పుడప్పు డు సిగ్నల్స్ అందుతుండటంతో షార్‌లో ఇటీవల నిర్మించిన మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ (ఎంవోటీఆర్) కేంద్రం ట్రాక్‌చేస్తూ ఉంది.
సముద్రంలో లేదా భూవాతావరణంలో..
షార్ అధికారులు చెప్పినదాని ప్రకారం.. ప్రయోగం జరిగిన నాటి నుంచి 60 రోజుల్లోపు ఆ శకలం భూమికి చేరుకుంటుంది. ఈ లెక్కన అక్టోబర్ నెలాఖరుకు ఈ రాకెట్ శకలం భూమిని చేరుకుంటుందని అంచనావేస్తున్నారు. శకలం భూవాతావరణంలోకి రాగానే పైనే పేలిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉపగ్రహానికి అమర్చిన ఉష్ణపుగది నేరుగా వస్తే ఎంవోటీఆర్ ద్వారా ట్రాక్‌చేసి బంగాళాఖాతంలోకి నెట్టేస్తారు. అదే పక్కకు తిరిగే పొజిషన్‌లో వస్తే మాత్రం భూవాతావరణంలోకి రాగానే పేలిపోతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉష్టపుగదిలో ఉన్న ఉపగ్రహంలో 827 కిలోల ద్రవ ఇంధనం మాత్రమే ఉన్నందున ఎలాంటి ప్రమాదమూ ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. హీట్‌షీల్డ్ నుంచి ఉపగ్రహం ఎందుకు విడిపోలేదనే దానిపై ఆదివారం కమిటీ రిపోర్టును ఇస్రో చైర్మన్‌కు సమర్పించారని తెలుస్తోంది.