శ్రద్ధగా పని చేయండి | Do work attentively | Sakshi
Sakshi News home page

శ్రద్ధగా పని చేయండి

Published Tue, Aug 19 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

శ్రద్ధగా పని చేయండి

శ్రద్ధగా పని చేయండి

అనంతపురం సిటీ: సానుకూల దృక్పథంతో విధి నిర్వహణపై శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. డీఎస్‌ఓ ఉమామహేశ్వర్‌రావు, గృహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్‌పిళ్లై, ఈఈలు అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రమౌళి, రాజశేఖర్‌లతో కలిసి ఆయన హౌసింగ్ డీఈ, ఏఈలతో సోమవారం స్థానిక డ్వామా హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఆధార్ వివరాల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.
 
ఇందిరమ్మ మొదటి విడత కింద ఇళ్లు మంజూరును రేషన్‌కార్డు నిమిత్తం లేకుండానే ఇచ్చామని ఇలాంటి వాటికి ఆధార్ సీడింగ్ కష్టమవుతుందని గృహనిర్మాణ శాఖ ఏఈ, డీఈలు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. లబ్దిదారుడి పేరు, తండ్రి పేరు ఆధారంగా వివరాలు సేకరించాలన్నారు.  ప్రధానంగా పునాది కన్నా తక్కువ స్థాయి(బీబీఎల్), పునాది స్థాయిలో ఉన్న (బీఎల్) లబ్ధిదారుల వివరాలు సేకరించాలన్నారు. గార్లదిన్నె మండలంలో పలువురు లబ్ధిదారులకు స్వస్థలం గార్లదిన్నె కాగా కల్లూరు అని ఆధార్‌లో నమోదైందని, ఇలాంటివి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కష్టమవుతుందని ఏఈ వివరించారు.
 
ఆధార్‌లో తప్పుల సవరణకు 56 ఏపీ ఆన్‌లైన్, 12 ఈ-సేవా కేంద్రాలున్నాయని వాటిలో సరిచేసుకోవచ్చునని డీఎస్‌ఓ ఉమామహేశ్వర్‌రావు సూచించారు.ఆధార్ వివరాలు కావాలంటే సంబంధిత తహసీల్దార్‌లతో హార్డ్‌డిస్క్‌లు తీసుకోవాలని సూచించారు. వారు స్పందించకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గృహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 27 లోగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఈలు కుప్పుస్వామి,లక్ష్మినారాయణమ్మ, శైలజ, తదితరులు పాల్గొన్నారు.
 
విధుల్లోకి తీసుకోండి: జేసీకి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వినతి
గృహనిర్మాణశాఖలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డేటాఎంట్రీ ఆపరేటర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌లుగా పనిచేస్తున్న తమను తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ  బాధితులు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్తామని జేసీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement