సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సరిహద్దుల ప్రకారమే రాష్ట్రాన్ని విభజించాలని, దీనిపై అభ్యంతరాలు పెట్టవద్దని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ తమ సీమాంధ్ర ప్రాంత నేతలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ గతంలో రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారమే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదికను సమర్పించాలని సలహా ఇచ్చింది. సీమాంధ్రుల సమస్యలపై తమకూ సానుకూలత ఉందని, దాన్ని చేతగానితనంగా భావిస్తే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
మంత్రుల బృందానికి అందజేయాల్సిన నివేదిక రూపురేఖలపై చర్చించేందుకు పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ మంగళవారమిక్కడ భేటీ అయింది. ఉద్యమ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కీలకమైన పది అంశాలను చర్చించింది. సీమాంధ్ర ప్రాంత బీజేపీ నేతలు కోరుతున్నట్టు భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపకూడదని, దానిపై చర్చ కూడా వద్దని పలువురు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కడితే మునిగిపోయే గ్రామాలన్నీ తెలంగాణలోనే ఎక్కువగా ఉంటాయని, అయినా సీమాంధ్రప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తాము అంగీకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై వితండవాదానికి దిగవద్దని సీమాంధ్ర నేతలకు సలహా ఇచ్చారు.
హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అందరిదని, హైదరాబాద్‌పై పూర్తి అధికారం తెలంగాణకే ఉండాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్ల పాటు కాకుండా నాలుగైదేళ్లకు కుదించేలా చూడాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా జీవోలు జారీ చేయాలని కూడా కొందరు నేతలు సూచించారు. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు వ్యయం మొత్తాన్నీ కేంద్రమే భరించేలా చూడాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలయ్యేలా చూడాలని కోరారు. రెండు మూడ్రోజుల్లో సీమాంధ్ర ఉద్యమ కమిటీతోనూ చర్చించి నివేదికను తయారు చేసి పార్టీ జా తీయ నాయకత్వానికి పంపాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా, విజయవాడ నగరానికి చెందిన మాంటిస్సోరీ విద్యాసంస్థల డెరైక్టర్ అవిర్నేని రాజీవ్ బీజేపీలో చేరారు.