అడుగు జాగ కూడా వదలం: బలరాంనాయక్
హన్మకొండ: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో ఒక్క అడుగు కూడా సీమాంధ్రకు వదిలిపెట్టేది లేదని కేంద్ర మంత్రి పి బలరాంనాయక్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ముంపు ప్రాంతాలైన భద్రాచలం, కూనవరం, వీర్‌పురం, వేలేరుపాడు, చింతూరు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు తాము ఒప్పుకోమన్నారు. అవసరమైతే పోలవరం డ్యాం ఎత్తు తగ్గించుకుని సీమాంధ్రలో ప్రాజెక్టు నిర్మిం చేలా డిజైన్‌లో మార్పు చేయాలని సూచించారు. అంతేతప్ప ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాలను ముంచి ప్రాజెక్టును కడతామంటే తాము అంగీకరించమని చెప్పారు.
చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడని, దీన్ని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు ఎందుకు అడ్డుకోవడం లేదని బలరాం నాయక్ ప్రశ్నిం చారు. రైల్వేబడ్జెట్ 2014-15లో డోర్నకల్‌లో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి తీసుకువస్తానని, ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రులను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసేం దుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.