ఏడాదిలోనే చంద్రబాబుకు ఛీత్కారం
అధికారం కోసం అర్రులు చాచి, సాధ్యాసాధ్యాలను విస్మరించి వాగ్దానాలు గుప్పించిన చంద్రబాబు.. అప్పుడే ‘ఢిల్లీ దయదలిస్తేనే అన్న సన్నాయినొక్కులు నొక్కుతున్నారని వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ విమర్శించింది. ‘కొత్త ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రిగా ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేరని, ఏడాదిలోనే ప్రజల ఛీత్కారానికి గురవుతారని పేర్కొంది.67 స్థానాలతో సత్తా చాటిన పార్టీని ఇతోధికంగా పటిష్టం చేయాలని, ప్రజల తరఫున సమరం సాగించాలని పిలుపునిచ్చింది.
సాక్షి, రాజమండ్రి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు పూర్తికాలం పాలించలేరని, ఏడాది తిరక్కుండానే ప్రజలు ఆయన్ను ఛీ కొడతారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నేత, నంద్యాల ఎమ్మెల్యే, జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన త్రిసభ్య కమిటీ నాయకుడు భూమా నాగిరెడ్డి అన్నారు. రాజమండ్రి జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కల్యాణ మండపంలో ఆదివారం రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, రామచంద్రపురం, మండపేట, రంపచోడవరం నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ ‘నాకు ఢిల్లీ ఇస్తేనే.. నేను మీకు చెప్పింది చేస్తా’ అంటున్న చంద్రబాబు స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేనందున అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై దుష్ట రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ‘మనం గ్రామస్థాయిలో క్యాడర్‌ను నిర్మించుకుంటున్న దశలో ఎన్నికలు వచ్చాయి. అయినా 30 ఏళ్లుగా బలమైన క్యాడర్‌తో ఉన్న పార్టీతో ధైర్యంగా పోరాడి 67 స్థానాలు దక్కించుకున్నాం.
టీడీపీతో పోలిస్తే కేవలం 78 వేల ఓట్లు మాత్రమే రాష్ట్రంలో తక్కువ పోలయ్యాయి. ఇది పార్టీ సాధించిన నైతిక విజయం’ అన్నారు. చంద్రబాబుకు ఇది చివరి దశ కావడంతో అధికారం కోసం ఎంతటి వాగ్దానాలు చేయడానికైనా వెనుకాడలేదని విమర్శించారు. కార్యకర్తలు తమ పటిమను చాటే సమయం ఇదేనని, బాబు చేసిన వాగ్దానాల్లో వాస్తవికత ఎంతో, జగన్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల్లో నిజాయితీ ఎంతో ప్రజలకు చెప్పాలని కోరారు. ‘గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎత్తి చూపాలి. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి.
ఓటమితో నైరాశ్యం చెందకుండా పార్టీని ప్రజలతో మమేకం చేయాలి’ అని పిలుపునిచ్చారు. నియోజక వర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీకి గల అనుకూల, ప్రతికూల అంశాలపై ఆరా తీశారు. నియోజక వర్గాల్లో కమిటీ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ, ప్రతి కార్యకర్త అభిప్రాయాన్నీ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముందు ఉంచుతామన్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో జగన్ రాజమండ్రి వచ్చి అన్ని విషయాలపై చర్చిస్తారని, ఆ సమయంలో కూడా ముఖ్య నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలు తెలపవచ్చని చెప్పారు.
బూటకపు వాగ్దానాలకు తెగించిన బాబు
కమిటీ సభ్యుడు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కె.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అమలు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోని చంద్రబాబు అధికారం కోసం అసాధ్యమైన వాగ్దానాలు చేశారన్నారు. పేదవాని బలహీనతలను ఓట్లుగా మలుచుకునేందుకు బూటకపు వాగ్దానాలకు తెగించారన్నారు. అయినా తన ముఖం చూసి ఓట్లు వేయరని మోడీ, పవన్ కళ్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని అధికారం సంపాదించారన్నారు. కమిటీ మరో సభ్యుడు, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భావించినా ఎన్నికల వేళ ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితులు అందరి అంచనాలను తారుమారు చేశాయన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీని పటిష్టపరుస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ, బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జీను మహేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, జగ్గంపేట, రంపచోడవరం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు.
పోరాటాన్ని కొనసాగిస్తాం : ఆకుల
త్రిసభ్య కమిటీ సభ్యులు ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమీక్ష చేపట్టారు. అనంతరం రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలపై సమీక్ష జరిపింది. భోజన విరామం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మండపేట నియోజకవర్గంతో ప్రారంభించి, అనంతరం రామచంద్రపురం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుమారు గంట జరిగిన రాజమండ్రి రూరల్ నియోజక వర్గ సమీక్షకు కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో తరలి వచ్చిన కార్యకర్తలు స్థానిక పరిస్థితులను కమిటీకి వివరించారు. ఆకుల మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవక పోయినా అధైర్యపడకుండా ప్రజలతో మమేక మై, పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానికంగా ఉన్న లోటుపాట్లను త్వరగా అధిగమిస్తాన్నారు.
అనపర్తి కార్యకర్తల ప్రమాణం
అనపర్తి నియోజక వర్గ కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నాయకత్వంలో కార్యకర్లతె రానున్న రోజుల్లో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తామని ప్రమాణం చేశారు. సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో చిన్న చిన్న లోపాలు ఏర్పడినా సాధ్యమైనంతవరకూ అధిగమించే ప్రయత్నం చేశామన్నారు. ఇంకా లోటుపాట్లుంటే అధినాయకత్వం సలహా సూచనల మేరకు గుర్తించి అధిగమిస్తామన్నారు. అధికార పార్టీ తప్పిదాలను ఎత్తిచూపడంలో కార్యకర్తలను ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీని ముందుకు నడిపిస్తానన్నారు.
ఎల్లప్పుడూ ప్రజలపక్షమే : జక్కంపూడి
గెలుపు, ఓటటములు లెక్కచేయబోమని, తాము ఎప్పుడూ ప్రజల పక్షమేనని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇక ముందూ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు తోడు నీడగా ఉంటామన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తామని, ఏ సమయంలోనైనా అన్ని వర్గాలకూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులను త్రిసభ్య కమిటీకి వివరించారు. ఇక ముందూ జక్కంపూడి నాయకత్వంలో ముందుకు సాగుతామన్నారు.
వైఫల్య కారణాలను సూక్ష్మస్థాయిలో
తెలుసుకుంటాం : గిరజాల
మండపేట నియోజకవర్గ సమీక్షకు కో ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామి నాయుడు నాయకత్వంలో కార్యకర్తలు తరలి వచ్చారు. కమిటీ ముందు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంది. స్థానిక పరిస్థితులను వివరించిన గిరజాల వైఫల్యాలకు కారణాలను సూక్ష్మస్థాయిలో అన్వేషించి, అధిగమిస్తామన్నారు. నియోజక వర్గ ప్రజలు నేటికీ వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారన్నారు. జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రిపాపారాయుడు స్థానిక పరిస్థితులను వివరించారు.
సమన్వయంతోనే విజయం సాధించాం : అనంత
రంపచోడవరం నియోజక వర్గంలో నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడమే విజయానికి కారణమని కో ఆర్డినేటర్ ఆనంత ఉదయ భాస్కర్ వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం పార్టీ జిల్లాలో మిగిలిన చోట్ల కన్నా మెరుగైన ఫలితాలు సాధించిన విషయాన్ని కమిటీ ముందుంచారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ తన విజయానికి నేతలు, కార్యకర్తలు పూర్తిగా సహకరించారన్నారు. టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి, విజయానికి కృషి చేసిన కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌కు, ఇతర జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
కలిసికట్టుగా బలోపేతం చేస్తాం : ఆదిరెడ్డి
చివరగా కమిటీ రాజమండ్రి సిటీ నియోజక వర్గ సమీక్షను చేపట్టింది. సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల నేతలు, పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని నగరంలో బలోపేతం చేస్తామన్నారు. కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు తమ సూచనలను అందజేశారు.