
కలపర్రు టోల్‌గేట్ వద్ద వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేయకుండా కాపలా ఉన్న నేతల రవి
పశ్చిమగోదావరి ,పెదపాడు:జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వాహనదారులు టోల్ ఫీజు చెల్లించవద్దంటూ పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్‌వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేశారు. గురువారం ఉదయం ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ఏపూరు గ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో కలపర్రు టోల్ గేట్ వద్ద ఆగారు. జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వాహనదారులు టోల్ ఫీజు చెల్లించవద్దని చెబుతూ టోల్ ఫీజు చెల్లించకుండానే వాహనాలను పంపించివేశారు. పార్టీ ఏలూరు మండల అధ్యక్షుడు నేతల రవిని అక్కడే ఉంచి, ఎవరి వద్ద నుంచి అయినా టోల్ వసూలు చేస్తే తన దృష్టికి తీసురావాలని ఆదేశించారు.
అనంతరం ఆయన ఏపూరులో కార్యక్రమం ముగించుకుని తిరిగి టోల్ గేట్ వద్దకు చేరుకుని అక్కడి నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో మాట్లాడారు. జాతీయ రహదారులు బాగు చేయకుండా టోల్ వసూలు చేయవద్దని, అవసరమైతే జిల్లా కలెక్టరుతో మాట్లాడాలని ఆయన వారికి సూచించారు. జాతీయ రహదారులు బాగుచేయకుండా టోల్ వసూలు చేస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. దీంతో టోల్ గేట్ అధికారులు టోల్ ఫీజు వసూలు చేయకుండా వాహనాలను వదిలేశారు.