
నీటి పాట్లు
గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన హిందూపురంలో పాలకులు మారినప్పటికీ ప్రజల కష్టాలు మాత్రం తీరడంలేదు.
ఎన్నికల హామీలు వేసవి వేడికి ఆవిరయ్యాయేమో.. పాలకుల నిర్లక్ష్యంతో హిందూపురం పట్టణ వాసుల గొంతులు తడారుతున్నాయి.. ఎన్టీఆర్ తనయుడిని ఎన్నుకుంటే తమ కష్టాలు ఈడేరుతాయనుకున్న హిందూపురం వాసులకు ఏడాదిగా ఎదురుచూపులే మిగిలాయి. కష్టాలు తీర్చే నాధుడే కనిపించడంలేదు. కరువు కాలంలో గుక్కెడు నీరు కావాలన్నా డబ్బులిచ్చి కొనాల్సిన పరిస్థితి.. పాలకుల చూపులకు మా కష్టాలు ఆనవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
హిందూపురం : గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన హిందూపురంలో పాలకులు మారినప్పటికీ ప్రజల కష్టాలు మాత్రం తీరడంలేదు. సుమారు 2 లక్షలపైగా జనాభా ఉన్న ఈ పట్టణంలో కనీస మౌలిక వసతులు లేవు. ముఖ్యంగా తాగడానికి నీరు దొరకడం లేదు. ఎన్నికల సమయంలో పీఏబీఆర్ పైపులైన్లను మార్చి పట్టణానికి నిరంతరంగా తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన ఎంపీ నిమ్మల కిష్టప్పగాని, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగాని తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.
బిందె నీరు రూ.3 నుంచి రూ.6లతో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పట్టణంలో ప్రైవేటు ట్యాంకర్లు, మున్సిపల్ ట్యాంకర్ల నిర్వాహకులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ.2లకే 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని ఇస్తామని చెప్పిన ముఖ్యమ్రంతి చ్రందబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. నీటి ప్లాంట్లను తమ అనుచరులకు అప్పజెప్పి తాగునీటితో కూడా వ్యాపారం చేయిస్తున్నారు.
పట్టణంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినప్పటికీ అక్కడ కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రారంభించి 8 నెలలు కావస్తుండడంతో వాటి నిర్వహణ తలకు మించిన భారమైంది. కరెంట్ బకాయిలు లక్షల్లో ఉండడంతో గత నెలలో వాటికి విద్యుత్ కూడా కట్ చేశారు. శుద్దజల ప్లాంట్లకోసం వేసిన బోర్లు కూడా ఎండిపోవడంతో ప్లాంట్ల నిర్వహణ కష్టమై మూలన పడే పరిస్థితి నెలకొంది.
గ్రామాల్లో మరీ దారుణం : హిందూపురం రూరల్ ప్రాంతంలో పంచాయతీ బోర్లు ఎండిపోవడంతో కనీసం ఇళ్లల్లో వాడుకోవడానికి కూడా నీరు దొరకడం లేదు. వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకొనే పరిస్థితి దాపురించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు రూ.650కోట్లు వెచ్చించి పీఏబీఆర్ నుంచి హిందూపురం పట్టణానికి తాగునీటిని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా కళ్యాణ దుర్గం, మడకశిర, హిందూపురం ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కలిగింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన కొన్ని ప్రాంతాల్లో పైపులు పగిలిపోతూ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోంది. అయినప్పటికీ ఆ నీటి ద్వారానే నేటికీ పురం వాసుల దాహార్థి తీరుతోంది.