జిల్లా ప్రజలకు తప్పని తాగునీటి ఇబ్బందులు
వేసవి వస్తే 48 గ్రామాలలో నరకం
నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకూ ఇబ్బంది
మూడేళ్లుగా పూర్తికాని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం
ఏలూరు టూటౌన్ : జిల్లాలోని రైతులు ఓ పక్కసాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క తాగునీటికి కూడా ప్రజలు కటకటలాడుతున్నారు. నరసాపురం మండలంలోని ఆరు గ్రామాల ప్రజలు, మొగల్తూరు మండలంలోని 42 గ్రామాల ప్రజలు వేసవి వస్తే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఆయా ప్రాంతాలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం చూపటంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని 48 మండలాలలో 2399 హేబిటేషన్లు ఉన్నాయి. నరసాపురం, మొగ ల్తూరు మండలాలలోని 48 గ్రామాలలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉంటున్నాయి. నరసాపురం పరిధిలోని పసలదీవి, కొత్తపేట, శెట్టిబలిజపేట, పసలదీవి హరిజనపేట, చామకూరిపాలెం, కొండవీటి కొడప గ్రామాల ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొగల్తూరు మండలంలోని మొగల్తూరు, వారతిప్ప, ముత్యాలపల్లి, మోడి, పేరుపాలెం సౌత్, పేరుపాలెం నార్త్, కేపీ పాలెం సౌత్, నార్త్‌ల పంచాయతీలలోని 42 గ్రామాలలో మంచినీటికి అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏటా ఇవే ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారులు 20 రోజులపాటు ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
ఈ గ్రామాలు సముద్ర తీర ప్రాంతం పరిధిలో ఉండటం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎన్నికలప్పుడు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు సముద్ర అలల్లో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సినీ పరిశ్రమలలోను, రాజకీయాల్లోనూ కీలక వ్యక్తులుగా ఉన్నప్పటికీ తాము పుట్టి పెరిగిన గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను పట్టించుకోకపోవటం స్థానికులను కలిచి వేస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని కుమ్మరరేవు, అమీనాపేటలోని బీసీ హాస్టల్, ఎంఆర్‌సీ కాలనీలకు చెందిన ప్రజలు మాత్రం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం రోజుకు 20 ట్యాంకర్ల ద్వారా నీటిని నగరపాలక సంస్థ అధికారులు సరఫరా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్లు వచ్చే వరకూ ఇంట్లో వంటలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మూడు సంవత్సరాలుగా పూర్తికాని ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు
జిల్లాలోని 65 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.14 కోట్ల 15లక్షలు కేటాయించారు. మూడు సంవత్సరాల క్రితమే ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు అయినప్పటికీ ఇప్పటికి ఇంకా పూర్తికాని దుస్థితి నెలకొని ఉంది. నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ స్కీం లో ఈ నిధులు మంజూరు అయ్యాయి. అధికారులు ఇప్పటి నుంచైనా యుద్ధ ప్రతిపాదికన పనులు చేయిస్తే వచ్చే వేసవికైనా ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫిల్టర్ వాటరు కొనాల్సిందే
అయితే జిల్లాలోని 60 శాతం మంది ప్రజలు మాత్రం తాగునీటికి ఫిల్టర్ వాటర్‌నే ఉపయోగిస్తున్నారు. డెల్డా, మెట్ట ప్రాంతాలతోపాటు ఏజెన్సీ ప్రాంతాలలో సైతం వాటర్ ప్లాంటులు అందుబాటులో ఉండటంతో ప్రజలు వాటినే కొనుగోలు చేసుకుని తాగుతున్నారు. 20 లీటర్ల నీళ్ల టిన్‌ను రూ. 2నుంచి రూ. 10 వెచ్చిస్తున్నారు. కొన్ని ప్లాంట్‌ల వారయితే ఈ నీటికే మినరల్ వాటర్ అని పేరు పెట్టి రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు.
మంచినీటికి చెడ్డ కష్టం!
Published Fri, Sep 4 2015 12:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement