‘గోదావరిలో జలకళ తగ్గింది. అయినంత మాత్రాన రైతులకొచ్చిన ఇబ్బందేమీ లేదు. సీలేరు జలాలను గోదావరిలోకి మళ్లిస్తున్నాం. సాగునీటిని పుష్కలంగా అందుబాటులో ఉంచుతాం. ఒక్క ఎకరాన్ని కూడా ఎండిపోనివ్వం’ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తరచూ చేస్తున్న ప్రకటనలివి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. సాగునీటి సమస్యలు అన్నదాతలను ఏడిపిస్తున్నాయి. నీరందక నై తీస్తున్న చేలు వారి కంట కన్నీరు కురిపిస్తున్నాయి. అటు గోదావరి గట్టును ఆనుకుని ఉన్న యలమంచిలి మండలం చించినాడ మొదలుకుని ఇటు దెందులూరు మండలం కొవ్వలి వరకూ రైతులను సాగునీటి సమస్య వేధిస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఎండలు ముదరకుండానే పంట చేలు బీటలు వారుతున్నాయి. రబీని గట్టెక్కించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి ఎద్దడి కారణంగా జిల్లావ్యాప్తంగా రబీ పంట ఎండిపోయే దుస్థితి నెలకొంది. వంతులవారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్కనీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 4.80 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లోనే నాట్లు ఆల స్యంగా పడ్డాయి. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక రైతులు నానాఇబ్బందులు పడ్డారు.
సాగు చేయ డం తప్ప మరో ప్రత్యామ్నాయం తెలియని అన్నదాతలు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు తెచ్చి మరీ పంటలు వేశారు. తెగుళ్లు, అకాల వర్షాలతో పంట చేతికొచ్చే సమయానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ఎకరానికి 35 బస్తాలు వస్తాయనుకుంటే అందులో సగం కూడా దిగుబడి రాలేదు. ఇక సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా చితికిపోయారు. కనీసం రబీ సీజన్‌లోనైనా గట్టెక్కుతామనుకున్న రైతన్నలకు నాట్లు వేసినప్పటినుంచీ సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేనివిధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరందే పరిస్థితి లేక పొలాలు ఎండిపోతున్నాయి. చేలు నై తీస్తున్నాయి.
వంతులవారీ విధానంతో రైతుల మధ్య స్పర్థలు
నెల రోజులుగా వంతుల వారీ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. అడపాదడపా నీరి స్తున్న వంతులవారీ విధానం వివిధ గ్రామాల్లో రైతుల మధ్య చిచ్చురేపుతోంది. ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న బోదెల అడ్డుకట్టల వల్ల పల్లపు భూములకు చుక్క నీరు కూడా రావడం లేదని శివారు భూముల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చిరుపొట్ట, పొట్ట దశలో వరి పంటకు ఎక్కువ నీరందాల్సి ఉంది. కానీ కనీసంగా కూడా పంటలను తడపలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు పంట దిగుబడులపై ప్రభా వం చూపిస్తాయని వాపోతున్నారు. ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడులు పెట్టామని, కనీస దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటల్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు
రబీ పంటను గట్టెక్కించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువల వెంబడి ఉన్న పొలాలకు కాలువలో అడుగంటిన నీళ్లను ఆయిల్ ఇంజిన్ల ద్వారా మళ్లిస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో మిగిలిన నీటిని తరలించి పంటలను రక్షించుకునే యత్నం చేస్తున్నారు. కొన్ని చోట్లయితే మురుగు నీటిని సైతం తరలించే యత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బీటలు వారిన పొలాలకు నీరు అందడం లేదు. చేలు తేరుకోవడం లేదు. ఫిబ్రవరి నెలాఖరు నాటికే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెలలో ఎండలు ముదిరితే రబీ పంట పూర్తిగా ఎండిపోతుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు ఏం చేస్తున్నట్టు?
సాగునీటి సమస్యతో జిల్లా రైతులు అల్లాడుతున్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి వారికి అండగా నిలవాల్సిన పాలకులు కనీస మాత్రంగా కూడా స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగేళ్ల కిందట ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాగా, అప్పటి పాలకులు పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరిపై ఎత్తిపోతలు ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలకు నీరందించే యత్నం చేశారు. ఇప్పుడు కనీసం ఆ దిశగా కూడా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడిపిం‘చేను’ సాగునీరు అందక ఎండుతున్న వరి చేలు
Published Sat, Feb 28 2015 12:56 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement