ఐఆర్‌పై నిర్ణయం వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి(ఐఆర్)పై ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురయింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఐఆర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులు ఎంతమేర ఐఆర్ కోరుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికే సీఎం పరిమితమయ్యారు. అయితే కొత్త సంవత్సర కానుకగా రెండు, మూడు రోజుల్లో ఐఆర్ ప్రకటిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 45 -55 శాతం ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ డిమాండ్‌ను ఎంతవరకు అంగీకరిస్తారనే విషయాన్ని సూత్రప్రాయంగా కూడా వెల్లడించడానికి సీఎం ఇష్టపడలేదు.
ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత ఐఆర్ ఎంత ఇవ్వాలనే అంశాన్ని నిర్ణయిస్తామని మాత్రమే జవిబిచ్చారు. చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్థిక శాఖతో చర్చించి ఐఆర్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే సంప్రదాయం గతంలో ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా జరగడంపై ఆక్షేపణ తెలిపారు. ఈనెలాఖరులోగా ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనకు దిగుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం ఇదే తీరు కొనసాగిస్తే జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు.
సీఎంతో జరిగిన చర్చల్లో ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థిక శాఖ అధికారులు, ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సరోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర జూనియుర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు వుధుసూదన్‌రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, టీజీవో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పద్మాచారి, సచివాలయ టీ-ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
25 శాతానికి తక్కువ కాకుండా: 25 శాతానికి తక్కువ కాకుండా ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందనీ, 25-30 శాతం వుధ్యలో ఐఆర్ ప్రకటన ఉంటుందని సంఘాలు తాజాగా ఆశలు పెంచుకుంటున్నారుు. 9వ పీఆర్సీ సమయంలో అప్పటి సీఎం వైఎస్సార్ 22 శాతం ఐఆర్ ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా ఐఆర్ ఉంటుందని, ఈ దిశగానే ప్రకటన వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు 45-55 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ 30 శాతానికి తగ్గితే అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. అవసరమైతే ఆందోళనకూ వెనకాడమంటున్నారు.
హెల్త్‌కార్డులపై నేడు చర్చలు: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలను ఉద్యోగ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సాధా రణ పరిపాలన, వైద్య, ఆరోగ్యశాఖ, ఆరోగ్యశ్రీ ట్రస్టు మధ్య సమన్వయం లేదని, ఫలితంగా పొంతనలేని నిబంధనలు, ఉత్తర్వులు వస్తున్నాయని విన్నవించారు. లోపాలు సవరించాలన్న వారి విజ్ఞప్తికి సీఎం స్పందించారు. సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కాగా ఉద్యోగులు, టీచర్లకు 50% తాత్కాలిక భృతి ప్రకటించాలని, హెల్త్‌కార్డులపై అనుమానాల్ని నివృత్తి చేయాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ.వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు.
హోంగార్డుల వేతనం పెంపునకు సీఎం హామీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో హోంగార్డులకు చెల్లించే రోజువారీ వేతనం రూ.200 నుంచి రూ.300కు పెంచేందుకు సీఎం కిరణ్ మరోసారి హామీ ఇచ్చారు. ప్రభుత్వోద్యోగులు, అధికారులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో హామీ ఇచ్చినట్టుగా రోజుకు రూ.100 పెంచుతామని, రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.