ప్రాణాధార మందులు కొనలేం
ప్రభుత్వాసుపత్రులకు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ లేఖ
హైదరాబాద్: ప్రాణాపాయ స్థితిలో వాడాల్సిన మందులు కొనలేమని ప్రభుత్వం నిర్ణయించడంతో సర్కారీ ఆస్పత్రులు ఒక్కసారిగా విస్తుపోయాయి. ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేసే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ రవిచంద్ర జూలై 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు ఐదురకాల ప్రాణాధార మందులు కొనలేకపోతున్నామని లేఖ రాశారు. వీటిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్, ఇన్సులిన్ (రెండు రకాలు), హ్యూమన్ ఆల్బుమిన్, ఎరిత్రోపాయిటిన్ మందులున్నాయి.
వీటికి సంబంధించి ఇంకా టెండరు ఖరారు కాలేదని, రవాణా సమస్యకూడా ఉందని అందుకే ఉన్న మందులతోనే సర్దుకోవాలని రాష్ట్రంలో ఉన్న అన్ని సెంట్రల్ డ్రగ్‌స్టోర్ (సీడీఎస్)లకు, అన్ని ఆస్పత్రుల ఫార్మసిస్ట్‌లకు ఈ లేఖ పంపారు. తొమ్మిది నెలలపాటు ఈ మందులు వచ్చే పరిస్థితి లేదని, ఉన్న స్టాకు కనీసం ఆరు నెలల పాటు వచ్చేలా చూడాలని ఆదేశాలివ్వడం కలకలం రేగింది. పైన పేర్కొన్న మందుల లైఫ్‌సేవింగ్ మందులని, వీటికోసం రోగులు వస్తే ఏం సమాధానం చెప్పాలని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు స్టాకే లేకపోతే ఆరునెలలు వాడాలని ఎలా చెబుతున్నారని ఫార్మసిస్ట్‌లు ఆశ్చర్యపోతున్నారు.