
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
కడప ఎడ్యుకేషన్: దరఖాస్తులు తీసుకోవాలంటూ డీఎస్సీ అభ్యర్థులు డీఈఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం డీఈఓ కార్యాలయానికి సెలవు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించకుండా దరఖాస్తులతో ఉదయాన్నే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ సిబ్బంది ఎవరూ లేరు.
కార్యాలయ ప్రధాన గేటుకు రెండో శనివారం, ఆదివారాలు సెలవని బోర్డును ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చామని, తమను పట్టించుకోవటం లేదంటూ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. దరఖాస్తులను స్వీరించాలని నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డీఈఓ ప్రతాప్‌రెడ్డి కార్యాలయ సిబ్బందిని పంపి అభ్యర్థుల దరఖాస్తులను స్వీరించి సమస్యను పరిష్కరించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం: డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు పైన డీఎస్సీ అభ్యర్థులు బైఠాయించి ఆందోళన చేయటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
దీనికి తోడు ఈ దారిలోనే రిమ్స్ హాస్పిటల్ ఉండటంతో అక్కడికి వెళ్లే చాలా మంది సిబ్బంది, రోగులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. ఆ దారిన వెళ్లే కొంత మంది జనం డీఎస్సీ అభ్యర్థులతో వాగ్వాదానికి దిగారు. మీ సమస్య ఉంటే డీఈఓ కార్యాలయం వద్ద అందోళన చేసుకోవాలి కానీ రోడ్డుపై బైఠాయించటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో కార్యాలయ సిబ్బంది వచ్చి దరఖాస్తులను తీసుకుంటామని చెప్పటంతో అభ్యర్థులంతా వెళ్లిపోయారు.
అభ్యర్థులు కూడా అర్థం చేసుకోవాలి: డీఈఓ
ప్రభుత్వ సెలవు దినాల్లో దరఖాస్తులు స్వీకరించబోమని రెండు సార్లు పేపర్లలో ప్రకటనలు ఇచ్చాం. పైగా కార్యాలయ వద్ద ఉన్న గేటుకు కూడా బోర్డును ఏర్పాటు చేశాం. దరఖాస్తులకు గడువేం ముగియలేదు ఈ నెల చివరి వరకూ ఉంది కదా. ఇలా చేయటం సబబు కాదు. కార్యాలయానికి సెలవు కావటంతో సిబ్బంది పనులపై ఎక్కడెక్కడికో వెళ్లి ఉంటారు. అలాంటి వారిని కార్యాలయానికి రమ్మనటం భావ్యం కాదు కదా. డీఎస్సీ అభ్యర్థులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వారికి ఇబ్బంది కలుగకూడదనే సిబ్బందిని కార్యాలయానికి పిలిపించి దరఖాస్తులు తీసుకున్నాం.
- ప్రతాప్‌రెడ్డి, డీఈఓ, వైఎస్‌ఆర్ జిల్లా