
మాజీ సర్పంచ్ వెంకటరమణ కుటుంబ సభ్యులకు బట్టలు అందజేస్తున్న డీఎస్పీ అనిల్ పులిపాటి
గూడెంకొత్తవీధి : ప్రజా ఉద్యమాల పేరిట మావోయిస్టులు చేస్తున్న పోరాటంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చింతపల్లి డీఎస్పీ అనిల్ పులిపాటి అన్నారు. ఆదివారం మండలంలోని జర్రెల పంచాయితీ కేంద్రంలో ఉచిత మెగా వైద్యశిబిరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే అమాయక గిరిజనులను ఇన్‌ఫార్మర్ల పేరిట దారుణంగా హతమారుస్తున్నారని అన్నారు.
పోలీసుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన్యంలోని చేయూత, ఉజ్వల, భవిత, రైతు నేస్తం, ముందడుగు వంటి కార్యక్రమాలతో గిరిజనులతో మమేకమవుతున్నట్టు చెప్పారు. తమశాఖ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అదనపు డీఎస్పీ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ గిరిజన యువతకు స్వయం ఉపాధి సూచించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారించడానికి పోలీసుశాఖ తగిన సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. జర్రెల మాజీ సర్పంచ్, 2016లో మావోయిస్టుల చేతిలో మృతి చెందిన సాగిన వెంకటరమణ తల్లిదండ్రులకు బట్టలు, సామాగ్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో 600 మంది రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశా రు. చింతపల్లి, జీకేవీధి సీఐలు చంద్రశేఖర్, నారాయణరావు, ఎస్‌బీఎఫ్ సీఐ వెంకటరావు, బీఎస్‌ఎఫ్ ఏసీ ఉపేంద్రోసింగ్, జీకేవీధి, చింతపల్లి ఎస్‌ఐలు చంద్రశేఖర్, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment