సాక్షి, నల్లగొండ/నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వివిధ రకాల పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ దెబ్బ నుంచి రైతులకు కాస్త ఊరటగా అందించే ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టనుంది. పరిహారం కింద సబ్సిడీ విత్తనాలను అందించి చేతులు దులపుకోవాలని చూస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ఇదీ పరిస్థితి..
నెల రోజులుగా ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు రూపొందించే పనిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పంట నష్టం వివరాల నివేదికకు అంత తొందర అవసరం లేదని చల్లగా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా యంత్రాంగానికి కబురు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతులు బ్యాంకు ఖాతానంబర్లు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట నష్టపరిహారం సర్వేలో జాప్యం జరుగుతోందని జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు వెల్లడించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతులకు డబ్బులను ఇచ్చే ఆలోచనేది లేదని, ఇస్తేగిస్తే సబ్సిడీపై విత్తనాలను ఇచ్చే ప్రతిపాదన ఉందని రాష్ట్ర స్థాయి అధికారులు మౌఖికంగా చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు పంటనష్ట పరిహారం అందుతుందున్న కోటి ఆశలతో ఉన్న రైతులపై పిడుగు పడినట్లయింది. అప్పు తెచ్చి వేలాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి రైతులు సాగుకు ఉపక్రమిం చారు. వరదలతో పంటలు నేలమట్టమయ్యాయి. ఇటువంటి దుర్భర పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ తీసుకోనున్న నిర్ణయంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు.
రూ.కోట్లలో నష్టం....
గత నెల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం అన్నదాతలను నిండా ముంచింది. 22 మండలాల్లో వివిధ పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. కోట్లది రూపాయల్లో నష్టం వాటిల్లింది. 278 గ్రామాల్లో దాదాపు 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. 24,251 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతినగా, మరో 5,351 హెక్టార్ల పంటలను వర్షపు నీరు ముంచెత్తిందని అంచనా వేశారు. అత్యధికంగా పెసర పంట వరద నీటికి కొట్టుకుపోయింది. 13,070 హెక్టార్లలో పంట పూర్తిగా చేతికి రాకుండా పోయింది. 10,219 హెక్టార్లలో వరిపైరు, 5,929 హెక్టార్లలో పత్తిపంట దెబ్బతింది. కంది 360 హెక్టార్లు, వేరుశనగ 20 హెక్టార్లు, 4 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈ మొత్తం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.
ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని అధికారుల్ని గతనెలలో ఆదేశించింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి ప్రతి రైతు నుంచి పంటల వారీగా వివరాలు సేకరించి తద్వారా ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నారు. ఈ వివరాలతో రూపొందించిన నివేదికను గత నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే ఆలోచనకు రావడంతో నివేదికపై ఎలాంటి ఒత్తిడీ అధికారులపై తీసుకరాలేదు. దీంతో అధికారులు నామమాత్రంగా నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ఇన్‌ఫట్ !
Published Fri, Sep 13 2013 2:24 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement