పంట నష్టం జాబితాలు తప్పులతడకగా ఉన్నాయంటూ గత నెల 27న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న మంత్రాలయం మండలం రచ్చుమర్రి రైతులు
ఇష్టారాజ్యం
Published Wed, Jul 5 2017 9:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM
- తప్పులతడకగా పంట నష్టం జాబితాలు
– నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు
– వేరుశనగ సాగు చేస్తే కందికి ఇన్‌పుట్ సబ్సిడీ
– అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జాబితాల తయారీ
– గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనకు పెట్టని వైనం
కర్నూలు (అగ్రికల్చర్):
– మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడుల్లో 50శాతం కూడా దక్కలేదు. గ్రామ రైతుల్లో దాదాపు 70 శాతం మంది చిన్న, సన్న కారు రైతులే. అయితే.. పంట నష్టం వివరాల నమోదులో వీఆర్‌ఓ, ఏఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఐదెకరాలు ఉంటే పావు ఎకరా, మూడెకరాలు ఉన్న రైతుకు అరఎకరాలో పంట నష్టం వాటిల్లినట్లు నమోదు చేశారు. దీంతో వారికి రూ.500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చింది.
–వెల్దుర్తి మండలం బోగోలు గ్రామంలో వడ్డె రాముడికి 357/1 సర్వే నంబరులో 2.50 ఎకరాలు, 357/ఏ సర్వే నంబరులో 2.50 ఎకరాల భూమి ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశారు. ఈ–క్రాప్ బుకింగ్‌లో వేరుశనగ అని నమోదైంది. అడంగల్‌లోనూ అదే పంటను పేర్కొన్నారు. కానీ ఇన్‌పుట్ సబ్సిడీకి మాత్రం ‘కంది పంట’ అని రాశారు. దీంతో రాముడు హెక్టారుకు రూ.5వేల ఇన్‌పుట్ సబ్సిడీని కోల్పోయారు. ‘మేము వేరుశనగ వేశాము కదా..! కంది పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందేమిట’ని అడిగితే.. పొరపాటు జరిగిందని, ఏమీ అనుకోవద్దని అధికారులు చెబుతున్నారు.
ఖరీఫ్-2016లో సాగు చేసిన అన్ని పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో పది మండలాల్లో పంటల దిగుబడి బాగా ఉందంటూ నష్టం వివరాలను నమోదు చేయలేదు. 26 మండలాలకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.325 కోట్లు ఇటీవల విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఏడీఏలకు విడుదల చేశారు. వారి నుంచి రైతులకు పంపిణీ చేస్తారు. కాగా.. పంట నష్టం వివరాల నమోదులో రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు.. వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. కావలసిన వారికి పత్తి, వేరుశనగ వేసినట్లు రాసి హెక్టారుకు రూ.15వేలు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేలా చూశారు. ఇతరులకు కొర్ర, కంది వంటి పంటలు చూపారు. దీనివల్ల వారికి తక్కువ మొత్తం వచ్చింది.
పాత జాబితాలనే వినియోగించారు!
ఇన్‌పుట్ సబ్సిడీ నమోదులో పాత జాబితాలతోనే మమ అనిపించినట్లు విమర్శలు వస్తున్నాయి. 2014లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించగా.. కేవలం ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని దేవనకొండ, ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ఈ మండలాలకు రూ.73 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలైంది. 2015, 2016లోనూ ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో ఇక్కడ 2014 కరువు జాబితాలనే 2015, 2016కు వినియోగించినట్లు విమర్శలున్నాయి. 2015లో ప్రభుత్వం జిల్లాలో 40 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అన్ని మండలాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించింది. నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేసి ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రతిపాదించారు. ఈ జాబితాలనే తిరిగి 2016లోనూ వినియోగించినట్లు తెలుస్తోంది. దీనివల్ల వేలాది మంది రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది.
నిబంధనలకు తూట్లు
నిబంధనల ప్రకారం పంట నష్టంపై సర్వే పూర్తయి, జాబితాలు రూపొందించిన తర్వాత వాటిని గ్రామ పంచాయతీల్లో రైతుల పరిశీలనకు ఉంచాలి. అందులో పేర్లు లేకపోయినా, ఒక పంట సాగు చేసి ఉంటే మరో పంటను నమోదు చేసినా, విస్తీర్ణంలో తేడా ఉన్నా.. రైతులు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిశీలించి.. తుదిజాబితాను రూపొందించి వ్యవసాయ సంయుక్త సంచాలకుడి(జేడీఏ)కి పంపాల్సి ఉంటుంది. కానీ ఏ గ్రామ పంచాయతీలోనూ రైతుల పరిశీలనకు జాబితాలు పెట్టిన ధాఖాలాలు లేవు. ప్రదర్శించి ఉంటే ఇప్పుడిన్ని ఫిర్యాదులు, ఆందోళనలు ఉండేవి కావు.
అధికార పార్టీ నేతల సిఫారసు మేరకే..
హాలహర్వి పూర్తిగా కరువు మండలం. ఇక్కడ అధికార పార్టీ నేతలు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం వారికి ఇష్టమైన వ్యక్తుల పేర్లు మాత్రమే నమోదు చేయించారు. నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. చింతకుంట, శ్రీధర్‌హాల్, కామినహాల్, బిలేహాల్ గ్రామాల్లో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే జాబితాలు రూపొందాయి. నిజమైన రైతులకు అన్యాయం జరగడంపై వీఆర్‌ఓ, తహసీల్దార్లను అడిగితే వ్యవసాయాధికారులపైన, వారిని అడిగితే రెవెన్యూ అధికారుల మీద చెబుతున్నారు. మొత్తమ్మీద అధికారుల తప్పిదాల వల్ల వేలాదిమంది రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
Advertisement